టీమిండియా పుంజుకుందా? పాత దారిలోనే వెళ్తోందా?
అనుభవమే గుణపాఠం సోమవారం పాకిస్థాన్ పై ఘన విజయం.. మంగళవారం లంకపై కిందామీద పడి గెలుపు.
By: Tupaki Desk | 13 Sep 2023 12:27 PM GMTచిరకాల ప్రత్యర్థిపై దుమ్మరేపే విజయం.. అంతలోనే అంతకంటే తక్కువ స్థాయి జట్టు చేతిలో ఆపసోపాలు.. ఇదీ ఆసియా కప్ లో టీమిండియా పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ కప్ ముంగిట మన జట్టు స్థితి ఏమిటనే సందేహం వ్యక్తమవుతోంది. వరుసగా రెండు రోజుల్లో జరిగిన మ్యాచ్ ల ద్వారా రోహిత్ సేన ఆడిన తీరు చూస్తే అభిమానుల సందేహాలు నిజమేననిపిస్తోంది. అయితే, వాస్తవంగా ఆలోచిస్తేనే దీనికి సరైన సమాధానం దొరుకుతుంది.
మూడు రోజులు మూడు మ్యాచ్ లు టీమిండియా ఆది, సోమ, మంగళవారాలు వరుసగా మూడు రోజులు మైదానంలో ఉంది. ఆదివారం మొదటి రోజు మ్యాచ్ పూర్తిగా సాగకున్నప్పటికీ 15 ఓవర్లపైనే ఓపెనర్లు నిలిచారు. అంటే.. జట్టంతా మానసికంగా సిద్ధమై గ్రౌండ్కు వచ్చినట్లు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయి సోమవారం కొనసాగగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వీరోచిత సెంచరీలు కొట్టారు. దీంతో 356 పరుగుల రికార్డు స్కోరు చేసింది. 228 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ లెక్కన సోమవారం మ్యాచ్ పూర్తిస్థాయిలో జరిగిందనే భావించాలి. అంటే ఈ రెండు రోజులు జట్టంతా గ్రౌండ్ కు వచ్చింది. ఇక మంగళవారం నాటి మ్యాచ్ లో టీమిండియా శ్రీలంకపై మొదట బ్యాటింగ్ కు దిగి ఆపసోపాలు పడిన మాట వాస్తవం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వరుసగా మూడో రోజు ఆడాల్సి రావడం.
లంకపై గెలుపునకు కష్టపడ్డారా? శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయానికి శ్రమించాల్సి వచ్చిన మాట వాస్తవమే. కనాకష్టం 200 మార్క్ దాటిన సంగతీ అందరికీ తెలిసిందే. అయితే, ప్రత్యర్థిని నిలువరించి ఎట్టకేలకు గెలిచింది. ఇక్కడ చూడాల్సింది.. మ్యాచ్ జరిగిన తీరును. పిచ్ వ్యవహరించిన తీరును. కొలంబోలో వరుసగా మూడో రోజు మ్యాచ్ ఆడడంతో పాటు పిచ్ స్పిన్ కు విపరీతంగా సహకరించింది. దీంతోనే భారత బ్యాటర్లు వేగంగా ఆడలేకపోయారు.
అనుభవమే గుణపాఠం సోమవారం పాకిస్థాన్ పై ఘన విజయం.. మంగళవారం లంకపై కిందామీద పడి గెలుపు. ఇది భారత జట్టుకు నిజంగా కావాల్సినదే. ఎందుకంటే.. వరుసగా సునాయాసంగా గెలుస్తూ పోతే లోపాలు తెలియవు. క్లిష్ట సమయాల్లో ఆడడం ఎలానో ఒంటబట్టదు. దీనికి భిన్నంగా విజయానికి చెమటోడ్చాల్సి రావడం రాటుదేలేందుకు పనికివస్తుంది. అదికూడా మరొక్క 25 రోజుల్లో సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్ ముందే జరగడం అన్నిటికంటే ముఖ్యం.
పరిస్థితులనూ చూడాలి కదా? నిన్నటి మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మన్ వైఫల్యాన్ని చూసినవారంతా మనది పేకమేడ బ్యాటింగ్ ఆర్డర్ అని విమర్శిస్తున్నారు. కానీ, వారు గమనించాల్సింది ఏమంటే పిచ్ స్పందించిన తీరు. కొలంబో మైదానంలో పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా సహకరించింది. 20 ఏళ్ల కుర్రాడు వెల్లలాగే ఐదు వికెట్లు పడగొట్టగా పార్ట్ టైమర్ పార్ట్ టైమర్ అసలంక నాలుగు వికెట్లు తీశాడు. దీన్నిబట్టే పిచ్ ఏతీరున ఉందో తెలుస్తోంది.
అంతేకాదు.. టీమిండియా వన్డే చరిత్రలో తొలిసారి మొత్తం 10 వికెట్లనూ స్పిన్నర్లకే (మరో వికెట్ తీక్షణ తీశాడు) సమర్పించుకోవడం ఇదే తొలిసారి. ఇక భారత బౌలింగ్ స్పిన్నర్ కుల్దీప్ చకచకా నాలుగు వికెట్లు తీశాడు. జడేజా రెండు పడగొట్టాడు. అంటే మ్యాచ్ మొత్తంలో 16 వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. ఇది అసాధారణం. ఈ నేపథ్యంలోనే పిచ్ స్పందించిన తీరును చూసి మ్యాచ్ ను అంచనా వేయాలి.