Begin typing your search above and press return to search.

ఆడింది 3.. గెలిచింది 0.. ఈ ఏడాది టీమ్ ఇండియా వన్డే రికార్డిది

ప్రపంచ క్రికెట్ లో మేటి జట్లు అంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్.

By:  Tupaki Desk   |   17 Aug 2024 4:30 PM GMT
ఆడింది 3.. గెలిచింది 0.. ఈ ఏడాది టీమ్ ఇండియా వన్డే రికార్డిది
X

ప్రపంచ క్రికెట్ లో మేటి జట్లు అంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్. ఈ ఆరు జట్లూ మూడు ఫార్మాట్లలో బలమైనవే. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తప్ప మిగతావన్నీ వన్డే ప్రపంచ కప్ విజేతలే. అయితే, టెస్టుల్లో చూస్తే దాదాపు అన్నీ సమఉజ్జీలే అనుకోవాలి. ఇక వన్డేల విషయానికి వస్తే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ముందుంటాయి. మరీ ముఖ్యంగా భారత్, ఆసీస్ ఈ ఫార్మాట్లో ప్రపంచ స్థాయి జట్లు. కానీ, ఈ ఏడాది భారత్ ఆడిన వన్డేలు ఎన్నో తెలుసా?

ఇన్ స్టంట్ క్రికెట్ బాటలో..

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టులకు పెట్టింది పేరు. టి20లు రాకముందు ఏడాదికి కనీసం 15 టెస్టులు ఆడిన సందర్భాలున్నాయి. ఇక భారత్ మొదటినుంచి వన్డే ఫేవరెట్. ఒకప్పుడు ఏడాది 40 వరకు వన్డేలు ఆడేది. టెస్టులు 10 వరకైనా ఉండేవి. అప్పటికి టి20లు లేవు కాబట్టి.. భారత్ వన్డేలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. అందులోనూ 20 ఏళ్ల కిందటి వరకు, ఐపీఎల్ రాకముందు వరకు భారత అభిమానులు వన్డేలంటే చెవి కోసుకునేవారు. ఎప్పుడైతే టి20లు, ఐపీఎల్ వచ్చాయో.. వన్డేలకు ప్రాభవం తగ్గింది. తరం మారడంతో పాటు ప్రేక్షుకుల ఆలోచనా ధోరణుల్లోనూ మార్పు వచ్చింది. ఇన్ స్టంట్ క్రికెట్ అయిన టి20ల వైపు మొగ్గు కనిపిస్తోంది.

ఆడింది మూడు.. గెలుపు లేదు..

గత ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ దిగ్విజయంగా జరిగింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. కప్ కొట్టేస్తుంది అనుకుంటే ఆస్ట్రేలియా అడ్డుపడింది. ఆ ఫైనల్ జరిగింది నవంబరు 19న. అంతే.. అప్పటినుంచి భారత్ మొన్నటి శ్రీలంక పర్యటన వాకా వన్డేలు ఆడిందే లేదు. రెండుసార్లు వన్డే ప్రపంచ కప్ చాంపియన్, రెండుసార్లు ఫైనలిస్టు, వంద కోట్ల అభిమానులు ఉన్న భారత్ దాదాపు 9 నెలల తర్వాత వన్డే ఆడిందంటే ఆశ్చర్యమే. అయితే, ఈ మధ్యలో పదిహేనుకు పైగా టి20 ఆడింది. ఐపీఎల్ లో మన క్రికెటర్లు పాల్గొన్నారు. టి20 ప్రపంచ కప్ కొట్టుకొచ్చారు. ఇక గత ఏడాది నవంబరు 19 తర్వాత ఇటీవల శ్రీలంకతో సిరీస్ సందర్భంగా వన్డేలు ఆడారు. ఇది మూడు మ్యాచ్ ల సిరీస్ కాగా.. తొలి మ్యాచ్ టై అయింది. రెండు, మూడో మ్యాచ్ లలో భారత్ ఓడిపోయింది. 27ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ అప్పగించింది.

నాలుగు నెలలు.. వన్డేలు లేవు

ఈ ఏడాది ఇంకా నాలుగున్నర నెలలు ఉంది. భారత్ తదుపరి సెప్టెంబరులో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్, మూడు టి20ల సిరీస్ ఆడనుంది. ఆపై న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఉంది. ఇవి పూర్తయిన వెంటనే నవంబరులో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తుంది. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ ఐదు టెస్టుల సిరీస్ లో పాల్గొననుంది. ఈ సిరీస్ నవంబరు 22న మొదలై.. జనవరి 7న ముగియనుంది. అనంతరం భారత్ తిరిగివస్తుంది. ఇంగ్లండ్ మన దేశానికి వచ్చి ఐదు టి20లు ఆడుతుంది.

2025 ఫిబ్రవరి 6న ఇంగ్లండ్ తో వన్డే జరగనుంది. దీనికిముందు భారత్ ఆడిన చివరి వన్డే ఆగస్టు 7న. అంటే ఐదు నెలలు. అప్పట్లో ఒక వన్డేకు ఒక వన్డేకు ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఇచ్చిన జట్టు భారత్. అలాంటిది ఇప్పుడు ఒక్కో వన్డేకు మధ్యన నెలలకొద్దీ సమయం ఉండడం విచిత్రమే. అంతా (టి20)కాల మహిమ.