ఆఫ్గనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా భవితవ్యం!
దీంతో సెమీస్ లోకి వెళ్లిన భారత్.. గురువారం ఇంగ్లాండ్ తో తలపడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా భవితవ్యం ఆఫ్గనిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం మీద ఆదారపడింది.
By: Tupaki Desk | 25 Jun 2024 4:01 AM GMTటీ20 వరల్డ్ కప్ - 2024లో ఒక్క మ్యాచ్ మొత్తం టోర్నీ రూపురేఖలను మార్చేసిందని చెప్పొచ్చు! మొదట్లో పాకిస్థాన్ పై అమెరికా జట్టు గెలిచిన తర్వాత ఒక మార్పు కాగా... తాజాగా ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో భారత్ ను దెబ్బతీసిన ఆసిస్ ను టీంఇండియా ఆటగాళ్లూ కసితీరా ఓడించిన తర్వాత మరో మార్పు. దీంతో.. ఇప్పటికే భారత్ సెమీస్ కి చేరుకోగా... ఆసిస్ భవిష్యత్తు ఆఫ్గనిస్తాన్ చేతుల్లోకి వెళ్లింది!
అవును... అత్యంత రసవత్తరంగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ - 2024 టోర్నీలో ఆడిన రెండేసి మ్యాచ్ లలోనూ గెలిచిన అనంతరం భారత్ - ఆస్ట్రేలియా పోటీ పడ్డాయి. ఈ సమయంలో 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తగిలిన దెబ్బను గుర్తుకు తెచ్చుకున్నారో ఏమో కానీ... ఈ బ్యాట్ తోనూ, బంతితోనూ ఆధిపత్యం చలాయించి, ఆసిసి ను 24 పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి నుంచీ చెలరేగింది. ఇందులో భాగంగా.. రోహిత్ శర్మ (92: 41 బంతుల్లో 7×4, 8×6) ఆసిస్ బౌలర్లపై ఉపద్రవంలా విరుచుకుపడిపోతే... అనంతరం సూర్య కుమార్ (31: 16 బంతుల్లో 3×4, 2×6), శివమ్ దూబె (28: 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్ పాండ్య (27: 17 బంతుల్లో 1×4, 2×6) తోడవడంతో భారత్ 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ బ్యాటర్స్ లో ట్రావిస్ హెడ్ (76: 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి టెన్షన్ పెట్టినా.. అది సాధ్యం కాలేదు. మరోవైపు మిచెల్ మార్ష్ (37: 28 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడిగా ఫలితాన్ని మార్చలేకపోయాడు. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ (3/37), కుల్ దీప్ యాదవ్ (2/24) ధాటికి ఆసిసి 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో సెమీస్ లోకి వెళ్లిన భారత్.. గురువారం ఇంగ్లాండ్ తో తలపడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా భవితవ్యం ఆఫ్గనిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం మీద ఆదారపడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఆఫ్గనిస్తాన్ కూడా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రెండు జట్ల రన్ రేట్ మైనస్ లలోనే ఉంది.
ఈ నేపథ్యంలో జరగనున్న ఆఫ్గనిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే... ఆఫ్గాన్ రన్ రేట్ దృష్ట్యా ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాకాకుండా ఆఫ్గనిస్థాన్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా జట్టు బయలుదేరెయ్యవచ్చు!