Begin typing your search above and press return to search.

తీరిక లేని ఆట.. భారత క్రికెట్ ఓవర్ డోస్.. తిపి ఎక్కువైనా చేదే గురూ

ప్రపంచ కప్ లు గెలవడం ఏ క్రీడలోనైనా గొప్పే. మరీ ముఖ్యంగా 100 కోట్లమంది పైగా క్రికెట్ ను ఆరాధించే భారత్ వంటి దేశంలో ప్రపంచ విజేత అనే పదానికి అత్యంత విలువ ఉంటుంది.

By:  Tupaki Desk   |   8 July 2024 2:30 AM GMT
తీరిక లేని ఆట.. భారత క్రికెట్ ఓవర్ డోస్.. తిపి ఎక్కువైనా చేదే గురూ
X

వన్డే ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే ఆస్ట్రేలియాతో సిరీస్.. ఆ వెంటనే ఇంగ్లండ్ తో ఐదు టెస్టులు.. కాస్త విరామంతో రెండున్నర నెలల ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అది అయిన వారానికే టి20 ప్రపంచ కప్.. అక్కడినుంచి ఇంకా జట్టు స్వదేశానికి రాకముందే జింబాబ్వేతో టి20 సిరీస్.. ఇది ముగిసీ ముగియగానే శ్రీలంక టూర్. భారత క్రికెట్ జట్టు హెక్టిక్ షెడ్యూల్ ఇది. బహుశా ప్రపంచంలో ఏ జట్టుకూ ఇంతటి ఒత్తిడితో కూడిన షెడ్యూల్ ఉంటుందని ఊహించలేం. ఇక్కడ గమించాల్సింది ఏమంటే.. ఈ షెడ్యూల్ లో మూడు ఫార్మాట్లు (టి20, వన్డే, టెస్టు) ఉన్నాయి. అంటే.. ఆటగాళ్లు ఒకదాని నుంచి మరోదానికి అలవాటు పడడమూ సవాలే.

ప్రపంచ కప్ లు సరే.. ఆసక్తి మాటేమిటి?

ప్రపంచ కప్ లు గెలవడం ఏ క్రీడలోనైనా గొప్పే. మరీ ముఖ్యంగా 100 కోట్లమంది పైగా క్రికెట్ ను ఆరాధించే భారత్ వంటి దేశంలో ప్రపంచ విజేత అనే పదానికి అత్యంత విలువ ఉంటుంది. సరిగ్గా పది రోజుల కిందట టి20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందం ఇంకా మన మనస్సుల్లో అలాగే ఉంది. ఇదే కాదు.. 1983, 2011 వన్డే, 2007 టి20 ప్రపంచ కప్ లు గెలిచిన సందర్భాలూ మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. కాగా, 2007 T20 ట్రోఫీని ధోనీ ఎత్తినప్పుడు, భారతదేశం హృదయపూర్వకంగా సంబరాలు చేసుకుంది! 1983లో విజయం తర్వాత, ప్రతి ప్రపంచకప్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది. 2003లో ఫైనల్స్ లో విఫలమైంది, 2007 T20 టైటిల్ కోసం నిరీక్షణ మరింత మధురంగా మారింది. ఈ విజయం తర్వాత చాలా మంది యువ క్రికెటర్లు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. కపిల్ డెవిల్స్, అలాగే ధోని నేతృత్వంలోని 2007,2011 ప్రపంచ కప్ గెలిచిన జట్లను భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆదరిస్తారు. కానీ, ఇటీవలి టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆడిన 11 మంది ఆటగాళ్ల పేర్లను పేర్కొనలేరు.

భారతీయులు నిజంగా విసిగిపోయారా?

ఈ మాట నిజమే అనిపిస్తోంది. తీరిక లేని క్రికెట్ తోనే ఇలా జరిగిందని భావించవచ్చు. టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ 50 మిలియన్ల ప్రత్యక్ష వీక్షణలను ఆకర్షించింది! ఇది గణనీయమైన సంఖ్యనే. కానీ, 2011 వన్డే, 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ ల వీక్షకుల సంఖ్యతో సరిచూడలేం. అప్పట్లో చాలా గ్రామాలు శాటిలైట్ డిష్‌ లు, కరెంటు కోసం ఇబ్బందులు పడేవి. ఇప్పుడు, మొబైల్ ఫోన్‌ లోనే చూసేస్తున్నారు.

నిరుడు అక్టోబరు, నవంబరులో భారత్ వన్డే ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. వెంటనే ఐపీఎల్ వచ్చేసింది. దీని తర్వాత టి20 ప్రపంచ కప్ మొదలైంది. మధ్యలో ఐపీఎల్ సరేసరి. దీతోనే క్రికెట్‌పై భారత్‌ లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వస్తోంది. అంతేకాక.. క్రికెట్ ను వ్యాపారం చేశారనే అపవాదూ ఉంది. డబ్బుతో నడిచే ఒప్పందాలు ప్రపంచ కప్ విజయంపై కూడా నిరాసక్తతను కలిగిస్తున్నాయి. కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి సారించిన బీసీసీఐ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీన్నిబట్టి చెప్పేదేమంటే.. అభిమానుల ఆదరణ తగ్గకుండా ఉండాలంటే టోర్నీలు, సిరీస్ ల మధ్య గ్యాప్ ఉండాలి.