Begin typing your search above and press return to search.

7 సెమీస్ లలో మూడే పాస్.. టీమిండియాకు గండం!

మరొక్క ఐదు రోజులే. ప్రపంచ కప్ విజేత ఎవరో తెలిసిపోతుంది.. నాలుగేళ్ల పాటు జగజ్జేత హోదా ఎవరికి దక్కనుందో తేలిపోతుంది.. మరి అక్కడిదాకా వెళ్లాలంటే ముందుగా సెమీఫైనల్స్ దశను దాటాలి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 9:30 AM GMT
7 సెమీస్ లలో మూడే పాస్.. టీమిండియాకు గండం!
X

మరొక్క ఐదు రోజులే. ప్రపంచ కప్ విజేత ఎవరో తెలిసిపోతుంది.. నాలుగేళ్ల పాటు జగజ్జేత హోదా ఎవరికి దక్కనుందో తేలిపోతుంది.. మరి అక్కడిదాకా వెళ్లాలంటే ముందుగా సెమీఫైనల్స్ దశను దాటాలి. మరి.. బుధవారం తొలి సెమీఫైనల్. అందులోనూ టీమిండియా-న్యూజిలాండ్. ఏ టోర్నీలో అయినా.. కచ్చితంగా సెమీస్ చేరే స్థాయి ఉన్న జట్లు. అందులోనూ గత సెమీఫైనల్లో తలపడిన జట్లు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం ఈ జట్లు తలపడనున్నాయి.

తేలిక కానీ కష్టం..

సొంతగడ్డ, అనుభవం, ఫామ్ ఇలా దేనిలో చూసినా న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా మెరుగ్గా ఉంది. కానీ, కివీస్ ను అంత తక్కువగా తీసిపారేయలేం.. అందులోనూ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆ జట్టు కొట్టిన దెబ్బ మామూలుది కాదు. ఇప్పటి ఊపు ప్రకారం చూస్తే రోహిత్ సేనను అడ్డుకోవడం కష్టమే. మన జట్టు తొమ్మిదికి 9 మ్యాచ్ లలో గెలిచి సెమీస్ చేరగా.. న్యూజిలాండ్ నాలుగింటిలో ఓడింది. కనాకష్టంగా సెమీస్ గడప తొక్కింది. అయినా కివీస్ సమయం చూసుకుని చెలరేగుతుంది. అందుకనే.. న్యూజిలాండ్ అంటే తేలికే కానీ.. కష్టం అనేది.

సెమీస్ బ్యాడ్ లక్

లీగ్ దశలో బాగా ఆడి సెమీస్ లో ఓడిపోయిన గత రికార్డులు టీమిండియాకు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువ సందర్భాలున్నాయి. గతంలో వన్డే ప్రపంచ కప్ నకే పరిమితం కాగా.. టి20 ప్రపంచ కప్ లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌ లో టీమిండియా ఓడిపోయింది. ఇందులో రెండు సార్లు కివీస్ చేతిలోనే ఓడింది. 1975లో మొదలైన

వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా ఏడు సార్లు సెమీ ఫైనల్ చేరింది. మూడు సార్లు మాత్రమే సెమీస్‌ లో నెగ్గింది. తొలి రెండు (1975, 1979) ప్రపంచ కప్ లలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. 1983లో సెమీస్ చేరి.. అతిథ్య ఇంగ్లండ్‌ ను ఓడించి ఫైనల్‌ లో వెస్టిండీస్‌ ను మట్టికరిపించి ప్రపంచ విజేతగా నిలిచింది.

సొంతగడ్డపై రెండుసార్లు..

భారత్ తొలిసారి ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చినది 1987లో. అప్పుడు ప్రపంచ విజేత హోదాలో టీమిండియా సెమీస్ చేరింది. బుధవారం సెమీఫైనల్ జరగనున్న ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే నాడు ఇంగ్లండ్‌ తో సెమీస్ జరిగింది. 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 1992 ప్రపంచ కప్‌లో టీమిండియా లీగ్ దశను దాటలేకపోయింది. 1996లో మరోసారి ఆతిథ్యం ఇచ్చి సెమీస్ చేరింది. నాడు శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. గురువారం రెండో సెమీ ఫైనల్ జరిగే కోల్‌ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లోనే నాడు సెమీస్ జరిగింది. 1999 ప్రపంచ కప్‌ లో లీగ్ దశ దాటని టీమిండియా, సౌతాఫ్రికా వేదికగా సాగిన 2003 ప్రపంచ కప్‌ లో సెమీస్‌ లో కెన్యాపై 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడారు. 2007 ప్రపంచ కప్‌ లో లీగ్ దశను కూడా దాటలేకపోయింది. సొంతగడ్డపై 2011 ప్రపంచ కప్‌లో సెమీస్‌ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఫైనల్‌ లో శ్రీలంకను ఓడించి ప్రపంచ కప్‌ ను రెండోసారి గెలిచింది. 2015 ప్రపంచ కప్ సెమీస్‌ లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ లో జరిగిన 2019 ప్రపంచ కప్‌ లో సెమీస్‌ లోనే పరాజయం పాలైంది.

తొలి రెండు ప్రపంచ కప్ లను తీసేస్తే.. 1983 నుంచి టీమిండియా 40 ఏళ్లలో ఏడుసార్లు సెమీ ఫైనల్ చేరింది. 3 సార్లు గెలవగా.. 4 సార్లు ఓడిపోయింది. 1983, 2003, 2011లో సెమీ ఫైనల్స్‌లో గెలవగా.. 1987, 1996, 2015, 2019 ఓడిపోయింది. ఇప్పుడు 8వ సారి సెమీస్ ఆడుతోంది. రేపు గనుక విజయం సాధిస్తే.. లెక్క 4-4తో సమం అవుతుంది. 2019 నాటి పరాజయానికి కివీస్ కూ బదులు ఇచ్చినట్లు అవుతుంది.