షార్ట్ బాల్ బలహీనతపై టీమిండియా స్టార్ ‘‘షార్ట్ టెంపర్’’
ఇక బౌలర్లయితే ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారని, ఒకటీ రెండు చెత్త బంతులు వేస్తారని, సుదీర్ఘ స్పెల్ లు వేయలేరని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ నెస్ వెంటాడుతుంటుంది.
By: Tupaki Desk | 3 Nov 2023 8:01 AM GMTక్రికెటర్ లో ప్రతి ఆటగాడికి ఒక బలహీనత ఉంటుంది. బ్యాట్స్ మన్ కు అయితే కొన్ని తరహా బంతులను ఆడలేడనే పేరుంటుంది. కొన్ని తరహా షాట్లు కొట్టలేడనే బలహీనత కూడా ఉంటుంది. ఇక బౌలర్లయితే ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారని, ఒకటీ రెండు చెత్త బంతులు వేస్తారని, సుదీర్ఘ స్పెల్ లు వేయలేరని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ నెస్ వెంటాడుతుంటుంది. అయితే ,బౌలర్ల కంటే బ్యాట్స్ మెన్ ఎదుర్కొనే సమస్యలే ఎక్కువగా ఫోకస్ అవుతుంటాయి. ఇలానే టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ ఒకరు తరచూ ఒకే తరహాలో ఔటవుతుండడంతో చర్చ నడుస్తోంది.
బలహీనత కాకుంటే మరేమిటి..?
టీమిండియా నంబర్ 4 బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విమర్శలకు జవాబిచ్చాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ అందరి నోళ్లూ మూయించాడు. గత వారం ఇంగ్లండ్ తో కీలక సమయంలో షార్ట్ బాల్ కు వికెట్ పారేసుకుని విమర్శలకు తావిచ్చాడు అయ్యర్. 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో షమీ అద్భుత స్పెల్ గనుక లేకుంటే అయ్యరే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ అయ్యర్ ఇన్నింగ్స్ ను తక్కువ చేయలేం. టీమిండియా 357 పరుగుల స్కోరుకు చేరిందంటే అది అతడి ఎదురుదాడితోనే. మరోవైపు సిక్సులతో హోరెత్తించిన అయ్యర్ 106 మీటర్ల దూరం సిక్స్ కొట్టి టోర్నీలో అత్యంత ఎక్కువ దూరం సిక్స్ కొట్టిన బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కాడు. కాగా, శ్రేయస్ పూర్తిగా మిడిలార్డర్ బ్యాటర్. నంబర్ 4లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు ఇబ్బందులను తీరుస్తున్నాడు. అందుకనే శ్రేయస్ ను గాయం నుంచి కోలుకునేవరకు ఎదురుచూసి మరీ ప్రపంచ కప్ నకు ఎంపిక చేశారు. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి మూడు పెద్ద జట్ల మీద షార్ట్ బాల్ కు ఔటవడంతో విమర్శలు చెలరేగాయి. శ్రీలంకతో మ్యాచ్ లోనూ ఇలానే ఔటయినా, లేక విఫలమైనా అయ్యర్ స్థానానికి ముప్పుండేది. అయితే, ఆ చాన్స్ ఇవ్వకుండా రాణించాడు.
మీడియాపై రుసరుస
గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం అయ్యర్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సమయంలో ‘‘షార్ట్ బాల్ ఆడడంలో మీకు ఇబ్బంది ఎదురవుతుందా’’? అంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. దీంతో అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘షార్ట్ బాల్ కు ఇబ్బంది పడతాననే ప్రచారంలో వాస్తవం లేదు. అసలు ఆ ప్రాచారం మొదలుపెట్టిందే మీడియా. బ్యాట్స్ మన్ ఫలానా బంతికే ఔటవ్వాలని లేదు కదా? రెండు, మూడుసార్లు బౌల్డ్ అయితే, స్వింగ్, పేస్ ఆడడం రాదంటారా? నన్నూ అలానే అంటున్నారు. కావాలంటే నేను ఎన్ని పుల్ షాట్లు (షార్ట్ బాల్స్ కు) కొట్టానో చూడండి’’ అంటూ గట్టి జవాబిచ్చాడు. అయ్యర్ ఒప్పుకొన్నా, ఒప్పుకోకున్నా.. అతడికి షార్ట్ బాల్ ఆడడంలో బలహీనత ఉంది. అయితే, ఇది టెక్నిక్ లోపమో మరోటో కాదు. కేవలం ఆ బంతులను బౌండరీగానో, సిక్సర్ గానో పంపాలనే ఉత్సాహమే. ఈ క్రమంలో ఔటవుతున్నాడు. కాగా, అయ్యర్ భారత్ లో వన్డేల్లో 8 సార్లు, విదేశీ వేదికలపై 6 సార్లు షార్ట్ బంతులకు వికెట్ ఇచ్చేశాడు. ఇప్పటివరకు 48 ఇన్నింగ్స్ ఆడిన అతడు 14సార్లు.. పుల్ షాట్లు కొట్టబోయే పెవిలియన్ చేరాడు. దీంతోనే షార్ట్ బాల్ బలహీనత ఉందనే ప్రచారం జరుగుతోంది.