టీమిండియాకు అచ్చిరాని తెలుగు రాష్ట్రాల స్టేడియాలు.. అంతా నిరాశే
టీమిండియా ఏ ముహూర్తాన తెలుగు రాష్ట్రాల్లో టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు అడుగుపెట్టిందో కానీ.. అంతా అపశకునాలే.
By: Tupaki Desk | 29 Jan 2024 11:30 PM GMTటీమిండియా ఏ ముహూర్తాన తెలుగు రాష్ట్రాల్లో టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు అడుగుపెట్టిందో కానీ.. అంతా అపశకునాలే. హైదరాబాద్ లో తొలి టెస్టుకు ముందు స్టార్ బ్యాటర్ దూరమయ్యాడు. ఉప్పల్ మైదానంలో దిగాక మూడు రోజులు మంచి ప్రదర్శనే చేసినా.. నాలుగో రోజు రెండు సెషన్లలో బ్యాటింగ్ లో విఫలమై పరాజయం మూటగట్టుకుంది. అది కూడా గతంలో ఎన్నడూ ఓటమిచూడని స్టేడియంలో. ఇప్పుడు రెండో టెస్టు విశాఖపట్టణంలో జరగబోతుండగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు.
ఉప్పల్ లో గెలిచేస్తుందనుకుంటే
హైదరాబాద్ ఉప్పల్ మైదానం ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. చివరిసారిగా 2018లో వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ ను సునాయాసంగా గెలిచింది. కానీ, ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు మాత్రం నిరాశ మిగిల్చింది. తొలి రోజునే ప్రత్యర్థిని కుప్పకూల్చి.. వారి స్కోరులో దాదాపు సగం పరుగులు చేసి.. ఆపై దాదాపు 200 పరుగుల ఆధిక్యం సాధించి.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ బ్యాటింగ్ లో కాస్త పట్టువిడిచి ఓటమిని కొనితెచ్చుకుంది. ఇక ఈ టెస్టుకు ముందే భారత్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో తాను అందుబాటులో ఉండడం లేదని అతడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టులో భారత్ ను నిలబెట్టిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డారు. వీరిద్దరూ విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు.
వెంటాడుతున్న గాయాలు..
కేఎల్ రాహుల్, జడేజాలు ఇటీవలి కాలంలో తరచూ గాయపడుతున్నారు. గత ఏడాది రాహుల్ ఐపీఎల్ సహా చాలా టోర్నీలకు దూరమయ్యాడు. కేవలం ప్రపంచ కప్ ముందు జట్టులోకి వచ్చాడు. జడేజా కూడా గాయపడి కొన్ని సిరీస్ లు ఆడలేదు. మళ్లీ ఈ ఇద్దరు ఇప్పుడు గాయాలకు గురై రెండో టెస్టుకు దూరమయ్యారు. విశాఖలో వీరిద్దరూ ఆడడం లేదని బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో ముగ్గురిని స్క్వాడ్‌లోకి తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ లను ఎంపిక చేసింది. విశాఖపట్నంలో ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా తొలి టెస్టులో రన్నింగ్ చేస్తుండగా జడేజా మడమ కండరం పట్టేసిందని, రాహుల్ తొడ కండరం నొప్పి తలెత్తింది. అతడు విశ్రాంతి కోరాడని బీసీసీఐ పేర్కొంది.
విశాఖలో ముగ్గురు స్టార్లు లేకుండానే..
హైదరాబాద్ టెస్టులో కోహ్లి లేని లోటు కనిపించింది. అలాంటిది విశాఖ టెస్టులో కోహ్లి, జడేజా, రాహుల్ వంటి ముగ్గురు స్టార్లు లేకుండానే ఆడాల్సి వస్తోంది. ఇది జట్టు కూర్పుపై ప్రభావం చూపడం ఖాయం. మొత్తానికి ఈ ముగ్గురూ మూడో టెస్టుకైనా అందుబాటులోకి వస్తారా? అంటే.. కోహ్లి అయితే కచ్చితంగా వస్తాడు. జడేజా, రాహుల్ ఫిట్ నెస్ ను బట్టి చూస్తే ఈ సిరీస్ కే దూరమైనా ఆశ్చర్యం లేదు.