సఫారీ లెక్క సరిచేసిన టీమిండియా.. ఒకటిన్నర రోజుల్లోపే
తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయంతో అప్రదిష్ఠపాలైన రోహిత్ శర్మ సేన రెండో టెస్టును ఒకటిన్నర రోజులోపే ముగించేసి ఔరా అనిపించింది
By: Tupaki Desk | 4 Jan 2024 12:30 PM GMTదక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా రెండో టెస్టులో అదరగొట్టింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయంతో అప్రదిష్ఠపాలైన రోహిత్ శర్మ సేన రెండో టెస్టును ఒకటిన్నర రోజులోపే ముగించేసి ఔరా అనిపించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమయం అయింది. వాస్తవానికి ఈ టెస్టు మొదలవడానికి ముందు టీమిండియా గెలుస్తుందనే అంచనాలు ఎవరికీ లేవు. ఎందుకంటే టెస్టు వేదికైన కేప్ టౌన్ లోని సెంచూరియన్ పార్క్ పేసర్లకు స్వర్గధామం. అందులోనూ ఇక్కడ టెస్టు మ్యాచ్ ను ఒక్కసారి కూడా గెలవలేదు మన జట్టు. ఈ చరిత్ర కు చెక్ పెడుతూ శుక్రవారం రెండో టెస్టును లంచ్ ముగిశాక కొద్దిసేపటికే గెలుచుకుని చరిత్ర పుటలకెక్కింది.
ముందు సిరాజ్.. తర్వాత బుమ్రా
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపులో భారత పేసర్లదే ప్రధాన పాత్ర. అందులోనూ హైదరాబాదీ పేసర్ సిరాజ్ ది మరింత ముఖ్య భూమిక. బుధవారం దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లు పడగొట్టి 55 పరుగులకే పరిమితం చేయడంలో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కాగా, టీమిండియా బ్యాట్స్ మెన్ కూ కఠిన పరీక్ష ఎదురైన సెంచూరియన్ పిచ్ పై మన జట్టు 153 పరుగులే చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బుధవారమే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు గురువారం చెలరేగారు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ మార్క్ రమ్ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా 176 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 79 పరుగుల టార్గెట్ ఎదురైంది. కాగా, దక్షిణాఫ్రికాను గురువారం లంచ్ లోపే ఆలౌట్ చేయడంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలకంగా నిలిచాడు. 61 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా సఫారీలు కోలుకోకుండా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ పోషించిన పాత్రను ఈసారి బుమ్రా పోషించడం గమనార్హం.
ఆచితూచి కాదు.. బాదుడే
లక్ష్యం 79 పరుగులే. కానీ, ఆచితూచి ఆడితే వికెట్లుపడి ఇబ్బంది ఎదురవొచ్చు. దీంతో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడారు. మొదటి బంతికే బౌండరీ కొట్టిన జైశ్వాల్.. 23 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. ఇందులో 6 బౌండరీలు ఉండడం గమనార్హం. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం దూకుడుగానే ఆడాడు. దీంతో టీమిండియా 79 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
కొసమెరుపు: సెంచూరియన్ లో ఇప్పటివరకు ఆరు టెస్టులాడిన టీమిండియా ఒక్కటి కూడా గెలవలేదు. 1993, 2011లో డ్రా చేసుకోగలిగింది. అలాంటిది తాజా టెస్టును ఒకటిన్నర రోజుల్లోపే ముగించి చారిత్రక గెలుపును అందుకుంది. వాస్తవానికి దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ బవుమా. అతడు గాయపడి రెండో టెస్టుకు దూరవడంతో సీనియర్ ఓపెనర్ ఎల్గర్ కెప్టెన్సీ చేశాడు. ఎల్గర్ కు ఇది చివరి టెస్టు. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం అతడు చేసిన పెద్ద తప్పు. బౌలింగ్ తీసుకుని ఉంటే టీమిండియా బ్యాట్స్ మెన్ ను దక్షిణాఫ్రికా పేసర్లు చుట్టేసేవారే. కానీ, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తీసుకోవడం వారి కొంపముంచింది. అలా.. చివరి టెస్టు ఎల్గర్ కు చేదు అనుభవం మిగిల్చింది.