పట్టికలో టీమిండియా టాప్.. అందులో మాత్రం వెనుకే!
ఒకటి తర్వాత ఒకటి.. మ్యాచ్ తర్వాత మ్యాచ్.. ప్రత్యర్థి ఎవరైనా ఫలితం మాత్రం గెలుపుతో దూసుకెళుతున్న టీమిండియా దూసుకెళుతోంది.
By: Tupaki Desk | 23 Oct 2023 5:44 AM GMTఒకటి తర్వాత ఒకటి.. మ్యాచ్ తర్వాత మ్యాచ్.. ప్రత్యర్థి ఎవరైనా ఫలితం మాత్రం గెలుపుతో దూసుకెళుతున్న టీమిండియా దూసుకెళుతోంది. ఇప్పటివరకు తాను ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది. మొదటి నాలుగు మ్యాచ్ ల ఫలితాల విషయంలో ఆందోళన లేనప్పటికి.. ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న టీంలో అత్యంత బలమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ మీద సందేహాలు ఉన్నాయి.
ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించటం తెలిసిందే. తాజా విజయంతో టీమిండియా మొత్తం తాను ఆడిన ఐదు మ్యాచ్ లను గెలుచుకున్నట్లైంది. దీంతో.. పాయింట్ పట్టికలో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో న్యూజిలాండ్ 8 పాయింట్లతో నిలిచింది. మొత్తం 5 మ్యాచ్ లలో.. నాలుగింటిలోనే గెలిచింది. తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలు కావటంతో పాయింట్ల పట్టికలో వెనకబడింది.
ఇక.. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడగా.. మూడింట్లోనే విజయం సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఈ జట్టు మొత్తం ఆడిన నాలుగు మ్యార్ లలో రెండు మ్యాచుల్లో గెలిస్తే.. మరో రెండింట్లో ఓడింది. జాబితాలో నిలిచిన చివరి నాలుగు జట్ల విషయానికి వస్తే ఒక అంశం కామన్ గా కనిపిస్తుంది. ఈ నాలుగు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒక్కొక్కటి చొప్పున గెలవగా.. మూడింట్లో ఓడిపోయాయి.
పట్టికలో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్.. ఇంగ్లాండ్.. శ్రీలంక.. నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ సైతం ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఒక.. పాకిస్థాన్ విషయానికి వస్తే.. తాను ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండింటిలో గెలుపొందగా.. మరో రెండింటిలో ఓడింది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా.. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం మూడో స్థానంలో ఉండటం గమనార్హం. నెట్ రన్ రేట్ విషయంలోపాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. నెట్ రన్ రేట్ విషయంలో ముందుంది. 2.212 తో అందరి కంటే మిన్నగా ఉండగా.. తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ 1.481గా ఉంది. పాయింట్లలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం 1.353తో మూడో స్థానంలో నిలవటం గమనార్హం.