నెదర్లాండ్స్ లో తెలుగు 'తేజం'.. మరో అరుదైన రికార్డు
కాగా, నెదర్లాండ్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారిన విజయవాడ కుర్రాడు తేజ నిడమనూరుకి మరోసారి చోటు దక్కింది.
By: Tupaki Desk | 14 May 2024 4:30 PM GMTపుట్టిల్లైన ఇంగ్లండ్, ఐర్లాండ్ వంటి చోట్ల తప్ప యూరప్ దేశాల్లో క్రికెట్ కు ఆదరణ మహా తక్కువ. శతాబ్దంపైగా చరిత్ర ఉన్నప్పటికీ యూరప్ లోని మరే దేశం నుంచి కూడా జట్టు రాలేదంటే ఆశ్చర్యమే. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి చాలా డెవలప్ అయిన దేశాలున్నప్పటికీ.. వాటికి క్రికెట్ కంటే ఫుట్ బాల్ పైనే ఎక్కువ శ్రద్ధ. మనదగ్గర ఐపీఎల్ లా యూరప్ లో పలు ఫుట్ బాల్ లీగ్ లు అత్యంత ఆదరణ పొందాయి. ఇలాంటి యూరప్ నుంచి మరో జట్టు ప్రపంచ స్థాయికి ఎదుగుతోంది. అందులో మన తెలుగు కుర్రాడి పాత్ర ఉండడం అందరం గర్వించదగిన విషయం.
రెండు ప్రపంచ కప్ లలో జూన్ 1 నుంచి అమెరికా, కరీబియన్ దీవుల వేదికగా టి20 ప్రపంచ కప్ జరగనుంది. నెదర్లాండ్స్ ఇందుకోసం తమ జట్టును ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. వెటరన్లు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, కోలిన్ అకెర్‌మాన్ లకు జట్టులో చోటు దక్కలేదు. కౌంటీ కమిట్ మెంట్లు ఉండడంతో జాతీయ జట్టు ఎంపికకు అందుబాటులో లేకుండా పోయారు. కాగా, నెదర్లాండ్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారిన విజయవాడ కుర్రాడు తేజ నిడమనూరుకి మరోసారి చోటు దక్కింది. తేజ.. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి న్యూజిలాండ్ వెళ్లి ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. అనంతరం తేజకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చాడు. ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్ తరపున క్రికెట్ ఆడుతూ నెదర్లాండ్స్ క్రికెట్ సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అప్పటినుంచి రెగ్యులర్ సభ్యుడిగా మారాడు.
వరుసగా రెండో ప్రపంచ కప్ లోనూ తేజ నిడమానూరు ఇటీవల భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లోనూ నెదర్లాండ్స్ కు ఆడాడు. అంతేకాదు.. భారత్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్స్ లు ఉండడం గమనార్హం. కాగా, ఇప్పడు టి20 ప్రపంచ కప్ లోనూ నెదర్లాండ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 29 ఏళ్ల తేజ నిడమానూరు ఈ టోర్నీలో రాణిస్తే మున్ముందు నెదర్లాండ్స్ కెప్టెన్ అయ్యే చాన్సుంది.