కంగారూలకు కొరుకుడు పడని తెలుగోళ్లు..
వెళ్లిన ప్రతి దేశంలోనూ విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న ఆస్ట్రేలియా కు 2000-01 సీజన్ లో టీమ్ ఇండియా పరాజయం రుచి చూపించింది.
By: Tupaki Desk | 28 Dec 2024 5:30 PM GMTవెళ్లిన ప్రతి దేశంలోనూ విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న ఆస్ట్రేలియా కు 2000-01 సీజన్ లో టీమ్ ఇండియా పరాజయం రుచి చూపించింది. దీనివెనుక ఉన్న ప్రధాన శక్తి వెరీ వెరీ స్పెషల్ గా ఆస్ట్రేలియన్లు పిలుచుకునే వీవీఎస్ లక్ష్మణ్. ప్రఖ్యాత కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అది చరిత్రలో నిలిచిపోయింది.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 21 ఏళ్ల తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లేకుంటే ఆస్ట్రేలియా ఈ పాటికే సిరీస్ ను గెలుచుకుని ఉండేదేమో..?
ఇద్దరూ తెలుగువారే. లక్ష్మణ్ స్వదేశంలో ఆడగా నితీశ్ ఆస్ట్రేలియా గడ్డపైనే సత్తా చాటాడు. కాగా, వీవీఎస్ ఆస్ట్రేలియాలోనూ ఆ దేశ జట్టును కంగారెత్తించాడు.
లక్ష్మణ్ తన కెరీర్ లో 17 సెంచరీలు సాధించగా ఇందులో ఆరు ఆస్ట్రేలియాపైనే చేశాడు. ఆరు వన్డే సెంచరీల్లో నాలుగు కంగారూలపైనే కొట్టాడు. అసలు లక్ష్మణ్ తొలి టెస్టు సెంచరీ (167)నే ఆస్ట్రేలియాపై కావడం గమనార్హం. 2000-01 సీజన్ లో దీనిని సాధించాడు. ఆ తర్వాత ఆడిలైడ్ (148), సిడ్నీ (178), సిడ్నీ (109)ల్లో సెంచరీలు కొట్టాడు.
తాజాగా నితీశ్ కూడా ఆస్ట్రేలియాపై సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టు సిరీస్ అనే బెరుకు ఏ మాత్రం లేకుండా ఆడుతున్నాడు. 41, 38, 42, 42, 16, 105 (బ్యాటింగ్).. ఇవీ అతడి స్కోర్లు. ఈ సిరీస్ లో టీమ్ ఇండియా తరఫున టాప్ స్కోరర్ అతడే.
కాగా, హైదరాబాదీ అజహరుద్దీన్ కూడా ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ముందు తరం హీరో అయిన ఎంఎల్ జైసింహా సైతం కంగారూలను కంగారెత్తించాడు. 1968 టూర్ లో విమానం నుంచి నేరుగా బ్రిస్బేన్ గబ్బా మైదానానికి వెళ్లిన అతడు 74, 101 పరుగుల ఇన్నింగ్స్ లు ఆడాడు.