Begin typing your search above and press return to search.

ముల్లాన్‌ పుర్‌ లో మెరిసిన తెలుగు కుర్రాడు... సన్ రైజర్స్ విక్టరీ!

అత్యంత ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్ ఆధ్యంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

By:  Tupaki Desk   |   10 April 2024 3:37 AM GMT
ముల్లాన్‌  పుర్‌  లో మెరిసిన తెలుగు కుర్రాడు... సన్  రైజర్స్  విక్టరీ!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 23వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ బరితంగా సాగింది. చివరి బంతి వరకూ ఫలితం తేలని రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు.. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మెరిసి.. విజయంలో కీలక భూమిక పోషించడం గమనార్హం. అత్యంత ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్ ఆధ్యంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

హైదరాబాద్‌ ఫస్ట్ బ్యాటింగ్!:

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్.. హైదరాబాద్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో... ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులోకి దిగారు. ఈ సందర్భంగా... రబాడ వేసిన తొలి ఓవర్‌ లో బౌండరీ బాదిన హెడ్.. హైదరాబాద్‌ పరుగుల ఖాతా తెరిచాడు! దీంతో తొలి ఓవర్ లో 4 పరుగులు వచ్చాయి.

అనంతరం... అర్ష్‌ దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌ లో ఆరు పరుగులు, కగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లతో 16 పరుగులు సాధించారు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 26కు చేరింది.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్!:

అర్ష్‌ దీప్‌ సింగ్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (21) అవుటవ్వగా... అదే ఓవర్ నాలుగో బంతికి మార్క్రమ్‌ డకౌటయ్యాడు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 28.

హైదరాబాద్ మూడో వికెట్ డౌన్!:

సామ్‌ కరన్‌ వేసిన ఐదో ఓవర్‌ లో నాలుగో బంతికి సిక్సర్ బాది, ఐదో బంతికి ఫోర్ కొట్టి, ఆరో బంతికి ఔటయ్యాడు అభిషేక్ శర్మ (16). దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి 3వికెట్లకు 39 పరుగులు చేసింది సన్ రైజర్స్.

హైదరాబాద్‌ నాలుగో వికెట్ డౌన్!:

హర్షల్ పటేల్ వేసిన పదో ఓవర్‌ లో నాలుగో బంతికి రాహుల్ త్రిపాఠి (11) ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 4 వికెట్ల నష్టానికి 66.

హైదరాబాద్‌ స్కోరు 100కు చేరింది!:

సామ్‌ కరన్‌ వేసిన 13 ఓవర్‌ లో 10 పరుగులు రావడంతో హైదరాబాద్ స్కోరు 100కి చేరుకుంది. దీంతో 13 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్‌!:

ఈ సీజన్ లో సూపర్ ఫాం లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (9) ఔటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన 13.1 ఓవర్‌ కు సామ్‌ కరన్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.

అర్ధ శతకం బాదేసిన నితీశ్!:

హర్‌ ప్రీత్ బ్రార్‌ వేసిన 15 ఓవర్‌ లో వరుసగా 4, 6, 4, 6 బాదడంతో 32 బంతుల్లోనే తెలుగు కుర్రాడు నితీశ్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో 15 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 133.

ఓకే ఓవర్ లో రెండు వికెట్లు!

అర్ష్‌ దీప్‌ వేసిన 17 ఓవర్‌ లో 16.3 ఓవర్‌ లో అబ్దుల్ సమద్‌ (25) ఔటయ్యాడు. అదే ఓవర్ ఐదో బంతికి నితీశ్ రెడ్డి (64) ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లకు స్కోరు 7 వికెట్లకు 152కు చేరింది.

ఎనిమిది వికెట్లు కోల్పోయిన హైదరాబాద్!:

రబాడ వేసిన 17.3 ఓవర్‌ కు పాట్ కమిన్స్ (3) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 155 పరుగుల వద్ద హైదరాబాద్‌ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

పంజాబ్ లక్ష్యం 183!:

పంజాబ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో తడబడినప్పటికీ తెలుగు కుర్రాడు నితీశ్ (64: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌ దీప్‌ సింగ్ 4, సామ్ కరన్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రబాడ ఒక వికెట్ తీశాడు.

పంజాబ్ ఛేజింగ్ స్టార్ట్... క్రీజులోకి ధావన్‌, బెయిర్‌ స్టో!

183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్‌ సిద్ధమైంది. శిఖర్‌ ధావన్‌, బెయిర్‌ స్టో క్రీజులోకి వచ్చారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌!:

పంజాబ్ కు రెండో ఓవర్ లోనే దెబ్బపడింది. ఇందులో భాగంగా... పాట్ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికి బెయిర్‌ స్టో డకౌట్‌ గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ లో ఒక్క పరుగే వచ్చింది.

దీంతో పంజాబ్ స్కోరు రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 2 పరుగులు.

మరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌!:

భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ప్రభ్‌ సిమ్రన్‌ (4) ఔటయ్యాడు. దీంతో మూడు ఓవర్లకు పంజాబ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 11.

మూడో వికెట్‌ డౌన్‌.. కెప్టెన్ గాన్!:

పంజాబ్‌ వరుస వికెట్లు కోల్పోతోంది. భువనేశ్వర్‌ వేసిన 4.4వ బంతికి శిఖర్ ధావన్ (14) స్టంపౌటయ్యాడు. దీంతో 5 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 20 పరుగులు చేసింది.

పంజాబ్‌ నాలుగో వికెట్:

పంజాబ్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. నటరాజన్‌ వేసిన 9.1 ఓవర్‌ కు కమిన్స్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో సామ్‌ కరన్ (29: 22 బంతుల్లో) ఔటయ్యాడు. దీత్మో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 66 పరుగులు చేసింది.

దూకుడు పెంచిన పంజాబ్ బ్యాటర్లు!:

షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 12 ఓవర్‌ లో నాలుగో బంతికి సికిందర్‌ రజా.. డీప్‌ స్క్వేర్‌ లెగ్ మీదుగా 95 మీటర్ల సిక్స్ బాదగా.. కమిన్స్‌ వేసిన 13 ఓవర్‌ లో చివరి బంతికి శశాంక్ ఫోర్ బాదాడు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 94 పరుగులు చేసింది.

ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్!:

ఉనద్కత్ వేసిన 14వ ఓవర్ తొలిబంతికి సికిందర్ రజా (28) ఔటయ్యాడు. దీంతో 91 పరుగులకు పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది. ఫలితంగా.. 14 ఓవర్లు పూరయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు సాధించింది.

100 దాటింది.. ఆరో వికెట్ పడింది!:

15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 105 పరుగులతో ఉంది. అంటే... చివరి ఐదు ఓవర్లలో విజయానికి 78 పరుగులు కావాలి. ఈ సమయంలో... నితీశ్‌ రెడ్డి వేసిన 16 ఓవర్‌ లో రెండో బంతికి సిక్స్ బాదిన జితేశ్‌ శర్మ (19) తర్వాతి బంతికే ఔటయ్యాడు.

అనంతరం భువనేశ్వర్‌ వేసిన 17 ఓవర్‌ లో శశాంక్‌ సింగ్ మూడు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. కమిన్స్‌ వేసిన 18 ఓవర్‌ లో అషుతోష్ శర్మ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

6 బంతుల్లో 29 పరుగులు!:

నటరాజన్‌ వేసిన 19 ఓవర్‌ లో 10 పరుగులు రావడంతో.. పంజాబ్ విజయానికి ఇంకా 6 బంతుల్లో 29 పరుగులు కావాలి.

ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ విజయం!:

ఆరు బంతుల్లో 29 పరుగులు అవసరం అయిన వేళ పంజాబ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. అశుతోష్ శర్మ వరుసగా... 6, 2 వైడ్లు, 6, 2, 2, వైడ్, సింగిల్ సాధించగా.. చివరి బంతికి శశాంక్ సింగ్ మరో సిక్స్ బాదడంతో 26 పరుగులు రాబట్టారు. దీంతో... ఈ ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

పంజాబ్ బ్యాటర్స్ లో అషుతోష్ శర్మ (33*: 15 బంతులలో 3 ఫోర్లు, 2 సిక్స్‌ లు), శశాంక్ సింగ్ (46: 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి ఆడారు.

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, కమిన్స్‌, నటరాజన్, ఉనద్కత్, నితీశ్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.