మీటింగ్ లో కునుకు.. నేరం తనది కాదంటున్న టెంబా!
వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు నుంచి వన్డే ప్రపంచకప్ - 2023 మెగా సమరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... బుధవారం ప్రీ వరల్డ్ కప్ సమావేశం నిర్వహించారు
By: Tupaki Desk | 5 Oct 2023 7:46 AM GMTఎంతో ముఖ్యమైన మీటింగ్స్ లోనూ, సమావేశాల్లోనూ పలువురు ప్రముఖులు చిన్నపాటి కునుకు తీస్తుంటారు. దానికి సంబందించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తర్వాత వివరణ ఇచ్చుకుంటారు.. అబ్బే తాను నిద్రపోలేదు, ధ్యానంలో ఉన్నాననో.. నిద్రపోలేదు ఏదో ఆలోచిస్తూన్నాననో చెబుతుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ కు వచ్చింది.
అవును... ఒక అతిముఖ్యమైన సమావేశంలో తాజాగా పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బావుమా కునుకు తీసినట్లుగా కనిపించారు.. దీంతో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ ని తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యమంలో ఆ సంఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు టెంబా. ఇందులో భాగంగా కెమెరా యాంగిల్ తప్పుగా పెట్టారు అంటూ కొత్త లాజిక్ తీశారు.
వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు నుంచి వన్డే ప్రపంచకప్ - 2023 మెగా సమరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... బుధవారం ప్రీ వరల్డ్ కప్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం పది జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. కెప్టెన్లందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో న్యూజిలాండ్ - శ్రీలంక కెప్టెన్ల మధ్యలో సౌతాఫ్రికా కెప్టెన్ కూర్చుని ఉన్నారు.
ఈ సమయంలో సమావేశం జరుగుతుండగా చక్కగా నిద్రలోకి జారుకున్నట్లు కనిపించాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంపై తాజాగా స్పందించాడు టెంబా. ఇందులో భాగంగా... "కెమెరా యాంగిల్ సరిగా లేదు. అంతే కానీ, నేను నిద్రపోలేదు" అని ఎక్స్ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమరంలో... భారత్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల టీం లు పాల్గొంటున్నాయి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆ మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి.