కొవిడ్ టీకా తీసుకోని టెన్నిస్ చాంపియన్ పై.. టోర్నీలో విష ప్రయోగం?
ఇలాంటి సమయంలో అతడు సంచలన ఆరోపణలు చేశాడు.
By: Tupaki Desk | 10 Jan 2025 11:02 AM GMTటెన్నిస్ ప్రపంచంలో అతడో దిగ్గజం.. కనీసం ఊహకైనా సాధ్యం కాని విధంగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కొట్టాడు. మరొక్క టైటిల్ సాధిస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ ల విజేతగా ఆవిర్భవిస్తాడు. దాదాపు రెండేళ్లుగా ఈ రికార్డు ఊరిస్తున్నా.. త్రుటిలో చేజారుతోంది. దానిని ఈ జనవరిలో సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అతడు సంచలన ఆరోపణలు చేశాడు.
సీజన్ తొలి గ్రాండ్ స్లామ్..
టెన్నిస్ లో నాలుగు గ్రాండ్ స్లామ్ లు ఉండగా.. వీటిలో జనవరిలో మొదలవుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్. దీంట్లో పాల్గొనడమే కాదు.. విజేతగా నిలిచి 25వ గ్రాండ్ స్లామ్ తో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధం అవుతున్నాడు సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్. అయితే, జకోకు ఆస్ట్రేలియా ఓపెన్ తో పెద్ద రగడే ఉంది. రెండేళ్ల కిందట అంటే కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ వేసుకోనందుకు జకోను ఈ టోర్నీలో ఆడనివ్వలేదు. ఈ వివాదం సమసిపోయినా.. మళ్లీ జకో దానిని గెలికాడు.
ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ తనపై గతంలో విష ప్రయోగం జరిగిందని ఆరోపించాడు. 2022లో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సమయంలో ఓ హోటల్ లో ఆహారం విషంగా మారిందని జకో వెల్లడించాడు. అది విష ప్రయోగమేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పలువురు నిపుణులు భిన్నంగా స్పందించారు.
ఆస్ట్రేలియా నుంచి తాను స్వదేశం వెళ్లాక అనారోగ్య సమస్యలు తలెత్తాయని జకో వివరించాడు. మెల్‌బోర్న్ లోని హోటల్ లో తిన్న ఆహారంలో విష ప్రయోగం జరిగినట్లుగా అనిపించిందన్నాడు. తన ఇబ్బందిని ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నాడు. ఆహారంలో అధికంగా భార లోహాలు మిక్స్ అయినట్లు గుర్తించానని తెలిపాడు. లెడ్ తో పాటు మెర్క్యురీ స్థాయిలు అధికంగా ఉండడం ఆహారాన్ని విషంగా మార్చి ఉండొచ్చని పేర్కొన్నాడు.
జకో వీగన్...
జకో వీగన్. అంటే.. జంతువులతో సంబంధం ఉన్న ఏ పదార్థాన్నీ ఆహారంలో తీసుకోడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో తనపై విష ప్రయోగం జరిగిందన్న అతడి వ్యాఖ్యలపై జార్జియా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ రీసెర్చ్ ఫెలో డామియన్ మాగంజా, మోనాష్ యూనివర్శిటీ న్యూట్రీషియన్ బయో కెమిస్ట్ డాక్టర్ బార్బరా కార్డోసో విశ్లేషణను వెల్లడించారు. ‘‘చేపలు లేదా నత్తల్లో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాలో దొరికే చేపల్లో కాదు. మెర్క్యురీ విషంగా మారేందుకు చాలా సమయం పడుతుంది. ప్రజలు పండించిన వాటిని కిరాణం దుకాణాల్లో అమ్ముతారు. వాటిని సరిగ్గా ప్రాసెస్ చేయకుంటే విషంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరైన పరీక్షలు చేయకుండా ఆహారంలో విషం కలిసిందని చెప్పలేం’’ అని కుండబద్దలు కొట్టారు.
కాగా కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలోనూ జకోవిచ్ టీకా తీసుకోలేదు. ఇప్పటికీ అతడు టీకా వేసుకన్నదీ లేనిదీ తెలియరాలేదు