ప్రపంచ కప్ నుంచి ఆ ఫేవరెట్ ఔట్?
ఇటీవల వరకు వన్డేల్లో 500 పరుగులు కొట్టగల జట్టు ఏదైనా ఉంటే చెప్పండి అంటే.. ఠక్కున వచ్చే సమాధానం ఇంగ్లండ్.
By: Tupaki Desk | 23 Oct 2023 5:04 AM GMTప్రపంచ కప్ మొదలుకాక ముందే ఆ జట్టును హాట్ ఫేవరెట్ గా విశ్లేషకులు అంచనా వేశారు. కప్ ప్రారంభం కానుందనగా ఆకాశానికెత్తేశారు.. కానీ, ఇప్పుడా జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరే పరిస్థితుల్లో లేదు. పాయింట్ల పట్టికలో ఎక్కడో 9వ స్థానంలో. నెట్ రన్ రేట్ లో అత్యంత అట్టడుగున నిలిచింది. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయి.. బ్యాటింగ్ లో తేలిపోతోంది. బౌలింగ్ లో అయితే అసలు పదునే లేదు. అసలు ఇది ఫేవరెట్ జట్టా? లేక పసికూననా? అనిపిస్తోంది. అన్నిటికిమించి ఫేవరెట్లలో ముందుగా టోర్నీ నుంచి ఔటయ్యేది ఈ జట్టేనంటే అతిశయోక్తి కాదేమో?
500 కొడుతుందనుకుంటే.. 150 కూడా కొట్టట్లేదు
ఇటీవల వరకు వన్డేల్లో 500 పరుగులు కొట్టగల జట్టు ఏదైనా ఉంటే చెప్పండి అంటే.. ఠక్కున వచ్చే సమాధానం ఇంగ్లండ్. అరివీర భయంకర హిట్టర్లు.. మేటి ఆల్ రౌండర్లతో ఆ జట్టుకు తిరుగుండేది కాదు. ప్రపంచ కప్ లోనూ ఇదే అంచనాలతో అడుగుపెట్టింది ఇంగ్లిష్ జట్టు. కానీ, అత్యంత పేలవంగా ఆడుతోంది. న్యూజిలాండ్ పై బ్యాడ్ లక్ కొద్దీ ఓడిందనుకోవచ్చు.. అఫ్ఘానిస్థాన్ చేతిలో ఓటమికి కారణమేమిటి? దక్షిణాఫ్రికాపై ఏమైంది..? చావోరేవోలాంటి పోరాటమే లేకుండా లొంగిపోతుందా? కనీసం 150 పరుగులు చేయడానికీ అవస్థ పడుతుందా? అందుకే ఈ ప్రపంచ కప్ లో మొదట నాకౌట్ అయ్యేది ఇంగ్లండ్ అని అందరూ చెబుతున్నారు.
బౌలింగ్ లో దమ్మేది..?
2019లో ఇంగ్లండ్ సొంతగడ్డపై ప్రపంచ కప్ కొట్టేసింది. నాడు బౌలింగ్ విభాగం అత్యంత పటిష్ఠంగా ఉండేది. జోఫ్రా ఆర్చర్ వంటి పేసర్ సేవలు అందుబాటులో ఉండేవి. బెన్ స్టోక్స్ వంటి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ బంతి అందుకునేవాడు. మిగతా పేసర్లు కాస్త చేయివేసినా.. బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడేవారు. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో, వన్ డౌన్ లో రూట్, ఆపై స్టోక్స్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఇలా బీభత్సమైన బ్యాటింగ్ బలం ఉండేది. అయితే, ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి. రాయ్ గాయం కారణంగా దూరం కావడంతో పెద్ద దెబ్బ పడింది. స్టోక్స్ గాయాల భయంతో బౌలింగ్ చేయడం లేదు. ఆర్చర్ గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ జట్టుతో పాటు తీసుకొచ్చారు. వీరు కాక ఇంగ్లండ్ పేసర్లుగా బంతి అందుకుంటున్న డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ పూర్తిగా తేలిపోతున్నారు. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ బట్లర్ సహా ఎవరూ పెద్దగా ఫామ్ లో లేరు. మలన్, బెయిర్ స్టో మెరుపులు చిన్న జట్లపైనే. దీంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోతోంది.
ఇక కష్టమే..?
-1.248 ఇదీ ప్రస్తుతం ఇంగ్లండ్ రన్ రేట్. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ లకు గాను ఒక్కటే గెలిచింది. ఆడాల్సిన ఐదు మ్యాచ్ లూ గెలిచినా కష్టమే. ఎందుకంటే అప్పుడు మొత్తం పాయింట్లు 12 మాత్రమే అవుతాయి. అందులోనూ ఇంకా భారత్, ఆస్ట్రేలియా వంటి జట్లతో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. కాబట్టి ఆ జట్టు సెమీఫైనల్స్ కు చేరడం కష్టమేనని చెప్పొచ్చు. మరోవైపు లక్ కలిసొచ్చి 12 పాయింట్లకే సెమీస్ ప్రవేశం అవకాశం దక్కినా.. నెట్ రన్ రేట్ మరీ తక్కువగా ఉంది. ఎలా చూసినా డిఫెండింగ్ చాంపియన్ సెమీస్ గడప తొక్కడం ఇప్పటివరకైతే దుర్లభమే అని చెప్పొచ్చు.