Begin typing your search above and press return to search.

అన్ ఫిట్.. నాన్ ప్లేయింగ్ టీమ్ ఇండియా కెప్టెన్.. ఇక వేటు వేయడమే

కానీ, ఆమె చేసిన ఒక్క తప్పునకు టీమ్ భారీ మూల్యం చెల్లించుకుంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 11:06 AM GMT
అన్ ఫిట్.. నాన్ ప్లేయింగ్ టీమ్ ఇండియా కెప్టెన్.. ఇక వేటు వేయడమే
X

ఆస్ట్రేలియాతో టి20 ప్రపంచ కప్ మ్యాచ్.. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాలి... క్రీజులో కెప్టెన్.. మొదటి బంతి వేసింది ప్రత్యర్థి బౌలర్.. షాట్ ఆడలేకపోయింది భారత కెప్టెన్.. కానీ, సింగిల్ తీసింది. అవతలి బ్యాటర్ ఎలాంటి వారనేది కాదు.. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. సెమీఫైనల్స్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కెప్టెన్ అయి ఉండీ.. బాధ్యత తీసుకోకుండా సింగిల్ తీయడం ఏమిటి..? గెలుపో ఓటమో కెప్టెన్ కాబట్టి బాధ్యత అంతా తీసుకుంటే సరిపోయేది. కానీ, ఆమె చేసిన ఒక్క తప్పునకు టీమ్ భారీ మూల్యం చెల్లించుకుంది. చెలరేగి బంతులేసిన ప్రత్యర్థి బౌలర్ మొత్తం నాలుగు వికెట్లు (రెండు రనౌట్లు సహా) పడగొట్టి తమ జట్టును గెలిపించుకుంది. ఈ మధ్యలో కెప్టెన్ మరో సింగిల్ (మూడో బంతికి) తీయడం గమనార్హం.

హర్మన్ హార్ గయా..

ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, తొలుత అంతగా బలమైనది ఏమీ కానీ న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోవడం దెబ్బకొట్టింది. మధ్యలో శ్రీలంక, పాకిస్థాన్ పై గెలిచినా చివరి లీగ్ మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియా మీద ఓడిపోవడంతో ఇంటికి వచ్చేసింది. అయితే, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ లో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ ఆడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. వాస్తవానికి హర్మన్ అర్ధ సెంచరీ చేసినా ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఆమె పూర్తిగా స్ట్రయికింగ్ తీసుకోలేదు. 14 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికే సింగిల్ తీసి దీప్తి శర్మకు స్ట్రయికింగ్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో హర్మన్ పై ట్రోలింగ్‌ నడిచింది. ఇప్పుడు ఆమె కెప్టెన్సీ ఊడే ప్రమాదం పొంచి ఉంది.

హర్మన్ అన్ ఫిట్

అప్పుడెప్పుడో 170 పరుగులు చేయడం తప్ప ఇటీవలి కాలంలో హర్మన్ ప్రీత్ నిలకడగా ఆడింది లేదు. దీంతో త్వరలోనే బీసీసీఐ.. జట్టు ప్రధాన కోచ్‌ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీతో సమావేశమై హర్మన్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. టి20 ప్రపంచ కప్ లో వైఫల్యం, హర్మన్‌ నాయకత్వంపై విమర్శలతో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హర్మన్ పై వేటే వేయకున్నా.. జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీసీసీఐ బలంగా నమ్ముతోందట. దీనికోసమే కోచ్‌, సెలక్షన్ కమిటీతో చర్చించనుందట. కాగా, కొత్త కెప్టెన్ గా వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన, డాషింగ్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. హైదరాబాదీ, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ మాత్రం స్మృతీ కంటే రోడ్రిగ్స్‌ వైపే మొగ్గుతోంది. 24 ఏళ్లే కావడం..మిడిలార్డర్‌ లో దూకుడుగా ఆడగలగడమే దీనికి కారణం.