Begin typing your search above and press return to search.

పరుగులూ లేవు.. డబ్బూ రాలలేదు.. టి20 వరల్డ్ కప్ తో 167 కోట్ల లాస్

ఆ దెబ్బతో మళ్లీ కరీబియన్ దీవులకు ప్రపంచ కప్ చాన్స్ రాలేదు.

By:  Tupaki Desk   |   18 July 2024 11:48 AM GMT
పరుగులూ లేవు.. డబ్బూ రాలలేదు.. టి20 వరల్డ్ కప్ తో 167 కోట్ల లాస్
X

2007లో అప్పటికింకా టి20లు జోరందుకోలేదు. వన్డేలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలోనే తొలిసారి కరీబియన్ దీవుల్లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్ జట్టుకు పుట్టినిల్లయిన ఈ దీవుల్లో ప్రపంచ కప్ అంటే అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ, అదేమిటో.. వెస్టిండీస్ జట్టులా 2007 ప్రపంచ కప్ అట్టర్ ఫ్లాప్ అయింది. భారత్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో నడిచింది. వారి కోచ్ అనూహ్యంగా చనిపోయాడు. ఇక ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య ఫైనల్ అయితే చీకట్లోనూ నిర్వహించారనే చెడ్డ పేరు వచ్చింది. ఆ దెబ్బతో మళ్లీ కరీబియన్ దీవులకు ప్రపంచ కప్ చాన్స్ రాలేదు. భవిష్యత్ లోనూ రాబోదు కూడా అనిపించింది.

కాలం మారింది..

అయితే, కాలం మారి.. వన్డేలను టి20లు ఆక్రమించడం, అందులో వెస్టిండీస్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతుండడంతో మళ్లీ కరీబియన్ దీవులకు ప్రపంచ కప్ నిర్వహించే భాగ్యం దక్కింది. ఎందుకైనా మంచిది అనుకున్నారేమో.. ఈసారి అమెరికానూ భాగస్వామ్యం చేశారు. కొన్ని మ్యాచ్ లు అమెరికాలో నిర్వహించారు. నాకౌట్ దశను మాత్రం కరీబియన్ దీవుల్లోనే జరిపారు.

రికార్డు స్కోర్లేవీ?

టి20లు అంటేనే ధనాధన్. పరుగుల ప్రవాహం. కానీ, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన తాజా ప్రపంచ కప్ లో ఆ స్థాయి పరుగుల ప్రవాహమే లేదు. అమెరికాలో అయితే 100 పరుగులు కూడా గగనంగా వచ్చాయి. కప్ ముగిసిన తర్వాత లెక్కలు తేల్చగా.. రూ.167 కోట్లు నష్టం వచ్చినట్లు తేలింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) కళ్లు బైర్లు కమ్మాయట. అయితే, ఈ నష్టం అంతా అమెరికాలో నిర్వహించిన మ్యాచ్ లకేనని సమాచారం. అమెరికా కరెన్సీలో చెప్పాలంటే 20 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం ఐసీసీ సమావేశంలో దీనిపై లోతుగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్లు కొనేవారు లేకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో అమెరికాలో మ్యాచ్ లకు నష్టం వచ్చిందని చెబుతున్నారు.

కొసమెరుపు: కొలంబో సమావేశం అనంతరం ఐసీసీ కొత్త చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అంటే.. జై షాకు మొదలు మొదలే పెద్ద సవాల్ ఎదురవనుంది.