ధోని తో ఆ ఐపీఎస్ ఆఫీసర్ కి గొడవ ఏంటి?
అసలు ఎవరు ఈ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఐపీఎస్ తో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న గొడవ ఏమిటి అనే సెర్చ్ నెట్టింట మొదలైంది.
By: Tupaki Desk | 16 Dec 2023 7:40 AM GMTటీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వేసిన కోర్టుధిక్కార కేసులో ఐపీఎస్ అధికారి జీ సంపత్ కుమార్ కు 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు ఈ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఐపీఎస్ తో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న గొడవ ఏమిటి అనే సెర్చ్ నెట్టింట మొదలైంది.
అవును... మహేంద్ర సింగ్ ధోనీ వేసిన కోర్టుధిక్కార కేసులో ఒక ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఏమిటీ కేసు అనే సెర్చ్ మొదలైంది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణల గురించి టీవీ చర్చలో తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. 2014లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్, జీ మీడియా కార్పొరేషన్ పై ధోనీ మద్రాసు హైకోర్టులో కేసు వేశారు.
తనపై తీవ్ర ఆరోపణలు చేసి, పరువునష్టం కలిగించినందుకు 100 కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ధోనీ కోరారు. ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ తరఫున తగిన వివరణ ఇవ్వకపోవడంతో కోర్టుధిక్కార చర్యలు చేపట్టాలని ధోనీ పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎస్. సుందర్, జస్టిస్ సుందర్ మోహన్ ల ఎదుట విచారణకు వచ్చింది.
ఈ సమయంలో వివరణ ఇచ్చేందుకు సమయం ఇచ్చినప్పటికీ... తగిన వివరణ ఇవ్వకపోవడంతో 15రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ సమయమొలో... ఈ 15రోజుల జైలు శిక్షను నిలిపి ఉంచాలని ఐపీఎస్ అధికారి తరఫున న్యాయవాది విన్నవించగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇందులో భాగంగా... అప్పీలు చేసుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు శిక్ష అమలును నిలిపివేసింది!
ధోనీకి జెర్సీ నెంబర్ 7 తో అరుదైన గౌరవం:
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ఇందులో భాగంగా... అతని జెర్సీ నంబర్ 7కు వీడ్కోలు పలకాలని బీసీసీఐ నిర్ణయించింది. అంటే... ఇక ఏ టీం ఇండియా క్రికెటర్ 7వ నంబర్ జెర్సీ వేసుకోవడం కుదరదన్నమాట. భారత క్రికెట్ కు చేసిన అద్భుత సేవలకు గాను బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాలపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా... "అతనో దిగ్గజ ఆటగాడు. భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ కు అతడు అందించిన సహకారం అపారమైంది. అతని సేవలకు గుర్తింపుగా 7వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది" అని వెల్లడించారు.
కాగా... అంతర్జాతీయ క్రికెట్ కు ధోని వీడ్కోలు చెప్పిన తర్వాత అతని 7వ జెర్సీ నంబర్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని మొట్టమొదటి సారిగా దినేశ్ కార్తీక్ డిమాండ్ చేశాడు. మరోవైపు సచిన్ టెండుల్కర్ జెర్సీ నంబర్ 10ని కూడా ఎవరూ ధరించని సంగతి తెలిసిందే