ఐపీఎల్ 17.. రన్ రేట్, స్కోర్లు, సిక్సర్ల మోత మోగింది..
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ముందునుంచీ ప్లేఆఫ్స్ రేసులో ఉండి చివర్లో బోల్తా కొట్టింది.
By: Tupaki Desk | 27 May 2024 10:33 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ సుదీర్ఘంగా సాగి ముగిసింది. మార్చి 22న మొదలైన లీగ్ కు మే 26తో తెరపడింది. అయితే, రెండు నెలల నాలుగు రోజులు జరిగినప్పటికీ అభిమానులకు లీగ్ ఎక్కడా విసుగు పుట్టించలేదు. దీనికి కారణం.. మ్యాచ్ లన్నీ మజమజాగా సాగడం.. పాయింట్లను పక్కనపెట్టి చూస్తే చాలా జట్లు ప్లేఆఫ్స్ కు అర్హమైనమే అనిపిస్తుంది. అంతెందుకు? డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ముందునుంచీ ప్లేఆఫ్స్ రేసులో ఉండి చివర్లో బోల్తా కొట్టింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తప్ప పంజాబ్, లఖ్ నవూ, ఢిల్లీ జట్లు మంచి క్రికెట్ ఆడాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ మూడింటి మధ్యనే..
చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రన్నరప్ సన్ రైజర్స్, మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో ఆసాంతం అద్భుతంగా ఆడాయి. మరీ ముఖ్యంగా కోల్ కతా, హైదరాబాద్ ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాయి. మధ్యలో ఢిల్లీ కూడా మెరుపులు మెరిపించింది.
రికార్డుల దుమ్మురేగింది
ఐపీఎల్ 17 సీజన్లలోనూ ఇదే బెస్ట్ సీజన్ అని చెప్పాలమో? మొత్తం టోర్నీలో ఎక్కడా వివాదాలు లేవు. సంచలనాలు తప్ప.. కాగా, సిక్సర్ల ప్రకారం చూస్తే సగం మ్యాచ్ లు పూర్తయ్యేసరికే 1,500 సిక్సర్లు నమోదవుతాయా? అనే అంచనా మొదలైంది. చివరకు 1,260 మాగ్జిమమ్స్ దగ్గర ఆగింది మీటర్. టోర్నీ చరిత్రలో ఇవే అత్యధికం. మరోవైపు 41 సార్లు 200పైగా స్కోర్లు నమోదయ్యాయి. అత్యధిక స్కోర్ 287 కూడా ఆ సీజన్ లోనే వచ్చింది. అత్యధిక రన్ రేట్ 9.56, అత్యధిక సెంచరీలు 14, చేజింగ్ లో అత్యధిక స్కోర్ 262 (పంజాబ్ వర్సెస్ కోల్ కతా), రెండు ఇన్నింగ్స్ లో కలిపి అత్యధిక స్కోర్ (549- సన్ రైజర్స్-ఆర్సీబీ) వంటి రికార్డులకూ ఈ సీజన్ వేదిక. కాగా, త్వరగా పూర్తయిన ఫైనల్/నాకౌట్ మ్యాచ్ గానూ ఆదివారం నాటి ఫైనల్ చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్ 29 ఓవర్లలో ముగిసింది. 10.3 బంతుల్లోనే కోల్ కతా లక్ష్యాన్ని ఛేదించింది.