Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18.. మెగా వేలానికి ముగ్గురు కెప్టెన్లు.. చరిత్రలో తొలిసారి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా విడుదలైన రెండు రోజులవుతున్నా ఒక్కో అంశం విశ్లేషణకు వస్తోంది.

By:  Tupaki Desk   |   2 Nov 2024 9:40 AM GMT
ఐపీఎల్-18.. మెగా వేలానికి ముగ్గురు కెప్టెన్లు.. చరిత్రలో తొలిసారి
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా విడుదలైన రెండు రోజులవుతున్నా ఒక్కో అంశం విశ్లేషణకు వస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫ్రాంచైజీలు ముగ్గురు ‘కెప్టెన్ల’ను వదులుకున్నాయి. సాధారణంగా చూస్తే ఇదేమీ ఆశ్చర్యం కాదు.. కానీ, ఈ ముగ్గురూ తమ జట్లపై బలమైన ముద్ర వేసినవారు. ఒకరైతే జట్టును పదేళ్ల తర్వాత చాంపియన్ గా నిలిపినవాడు. అలాంటిది వారినే వద్దనుకున్నాయి ఫ్రాంచైజీలు. వేలానికి వదిలేశాయి. 17 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక మిగిలిన ఏడు జట్లలో రెండింటికి కెప్టెన్లు మారుతున్నారు. మొత్తానికి 10 జట్లలో వచ్చే సీజన్ ఐదుగురు నూతన సారథులతో జట్లు పోటీపడనున్నాయి.

9 ఏళ్ల బంధానికి తెర..

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్టు. 17 సీజన్లకు గాను కొన్నిసార్లే మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక గత సీజన్ లో మాత్రం దుమ్మురేపింది. కెప్టెన్ రిషభ్ పంత్ కోలుకుని తిరిగిరావడం, ఆస్ట్రేలియా కుర్రాడు మెక్ గర్క్, దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్ మన్ ట్రిస్టన్ స్టబ్స్ అభిషేక్ పోరెల్ తదితరులతో కూడిన బ్యాటింగ్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వంటి బౌలర్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఆడితే విజేతగా నిలిచేదేమో..? కానీ కెప్టెన్ పంత్ ను వదులుకుంది. వాస్తవానికి 27 ఏళ్త పంత్ 9 ఏళ్లుగా ఢిల్లీతోనే కొనసాగుతున్నాడు. ఈ సారి మాత్రం కొనసాగేందుకు ఆసక్తి చూపించలేదట. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్, భారత దిగ్గజ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వంటి వారు సహా శిక్షణ సిబ్బందిని మారుస్తూ ఫ్రాంచైజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పంత్‌ కు నచ్చలేదట. అతడు కొనసాగేలా చర్చలు చేపట్టినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఇప్పుడు పంత్ మెగా వేలానికి వచ్చాడు. బహుశా ఢిల్లీకి రూ.16.50 కోట్లు పెట్టిన అక్షర్‌ పటేల్ సారథ్యం వహించవచ్చు. మరి.. పంత్ ను ఎవరు తీసుకుంటారో చూడాలి.

చాంపియన్ కెప్టెన్ నూ వద్దనుకుంది

నిరుడు వన్డే ప్రపంచ కప్ తర్వాత.. బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి దేశవాళీ క్రికెట్ లో ఆడలేదు శ్రేయస్ అయ్యర్. దాంతోనే అతడి కెరీర్ పై చీకట్లు కమ్ముకున్నాయి. అయితే, అలాంటి సమయంలో ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను చాంపియన్ గా నిలిపి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు శ్రేయస్. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ గంభీర్ మెంటార్ షిప్ లో శ్రేయస్ కోల్ కతాకు పదేళ్ల తర్వాత టైటిల్ అందించాడు. అయితే, ఈసారి మాత్రం అతడిని అట్టిపెట్టుకోలేదు. ఈ ఏడాది సీజన్ తర్వాత అయ్యర్ కు టీమ్ ఇండియా నుంచి పిలుపొచ్చింది. కానీ, అతడు రాణించలేకపోయాడు. పైగా టి20ల్లో అత్యంత కీలకమైన స్ట్రయిక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందట. ఫామ్ పడిపోవడంతో పాటు ధర ఎక్కువగా డిమాండ్ చేయడంతో శ్రేయస్ ను వేలానికి వదిలేసింది. రూ.13 కోట్లు వెచ్చించిన రింకూ సింగ్‌ ను కెప్టెన్ చేస్తుందేమో చూడాలి. లేదా వేలంలో దక్కించుకున్న వారిలో ఒకరిని కెప్టెన్ చేస్తుందేమో?

రాహుల్ లేని లక్నో..

2022 సీజన్ నుంచి ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించింది లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌. అప్పటినుంచి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్ గా ఉన్నాడు. తొలి రెండేళ్లు ప్లేఆఫ్స్ కూ చేర్చాడు. అయితే, రాహుల్‌ ను లఖ్ నవూ వద్దనుకుంది. ఈ ఏడాది మ్యాచ్ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా నేరుగా రాహుల్ తో వాగ్వాదానికి దిగడం, వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలు ముఖ్యంగా భావించే ఆటగాళ్లే తనకు కావాలనడంతోనే రాహుల్ ను విమర్శిస్తున్నట్లు తేలిపోయింది. ఇప్పుడు కేఎల్ వేలంలో దిగబోతున్నాడు. లఖ్ నవూ రూ.21 కోట్లు పెట్టిన వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ పూరన్‌ ను కెప్టెన్ చేస్తుందని భావిస్తున్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా కెప్టెన్లను మార్చనున్నాయి. బెంగళూరు తమ కెప్టెన్ డుప్లెసిస్ ను వదులుకోగా.. పంజాబ్ తమ సారథి శిఖర్ ధావన్ ను పక్కనపెట్టింది. బెంగళూరుకు కోహ్లి మళ్లీ కెప్టెన్ కానున్నాడు. పంజాబ్ మరి ఎవరిని తీసుకుంటుందో?