Begin typing your search above and press return to search.

తేలిపోయింది.. ఈ ఐపీఎల్ లో అట్టడగున నిలిచేది ఆ 3 జట్లే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆదివారంతో 29 మ్యాచ్ లు పూర్తికానున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 1:30 PM GMT
తేలిపోయింది.. ఈ ఐపీఎల్ లో అట్టడగున నిలిచేది ఆ 3 జట్లే?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆదివారంతో 29 మ్యాచ్ లు పూర్తికానున్నాయి. మొత్తం 74 మ్యాచ్ లకు గాను దాదాపు 40 శాతం మ్యాచ్ లు అయిపోయినట్లే. మరి ఇప్పటివరకు చూస్తే కొన్ని జట్లు చాలా ముందంలో ఉన్నాయి. మరికొన్ని తమవంతుగా పోరాటం చేస్తున్నాయి. కానీ, ఒక 3 జట్లు మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఆరేసి మ్యాచ్ లు ఆడిన ఈ జట్లు ఇకపై ముందడుగు వేసే అవకాశాలు లేవు. మరీ ముఖ్యంగా ఫామ్ ప్రకారం చూస్తే రెండు జట్లు మాత్రం అట్టడుగున నిలవడం ఖాయం.

ఈ సాలా కప్ నమది కాదు

‘‘ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే)’’ అంటూ 17 సీజన్లుగా ఐపీఎల్ లోకి దిగుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ అయిన విరాట్ కోహ్లి కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి ఇదే జట్టుకు ఆడుతున్నాడు. ఈ సమయంలో అతడు అంతర్జాతీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. కానీ, బెంగళూరు మాత్రం అంతకంతకూ పడిపోయింది. కోహ్లి కెరీర్ చివరి దశకు కూడా వచ్చేశాడు. బెంగళూరు మాత్రం ఐపీఎల్ విన్నర్ కాలేకపోయింది. ఇప్పటి సీజన్ లో మరింత పేలవంగా ఆడుతోంది. ఆరు మ్యాచ్ లలో ఒక్కటే గెలిచింది. రన్ రేట్ ప్రకారం చూస్తే -1.124తో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బెంగళూరు ఆడుతున్న తీరు దారుణంగా ఉంది. మొన్నటివరకు కోహ్లి పరుగులు చేశాడు. గత మ్యాచ్ లో అతడూ విఫలమయ్యాడు. డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, కోహ్లి మీదనే జట్టు నడుస్తోంది. బౌలింగ్ మరింత పేలవం. టీమిండియా పేసర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ పూర్తిగా గాడితప్పాడు. వరుసగా క్రికెట్ ఆడుతున్న అతడు అలసిపోయాడని స్పష్టం అవుతోంది. బెంగళూరుకు సరైన ఫినిషర్, మంచి ఆల్ రౌండర్ లేకపోవడం పెద్ద లోటు. కోహ్లి, డుప్లెసి, కార్తీక్ తప్ప మరో మంచి బ్యాటర్ కూడా లేడు. ఇప్పటికైతే బెంగళూరు ప్లేఆఫ్స్ కు చేరడం కష్టమే. అద్భుతం జరిగితే తప్ప.

‘పంజా’బ్ ఎక్కడ..?

బెంగళూరులాగే ఇంతవరకు టైటిల్ కొట్టని జట్టు పంజాబ్ కింగ్స్. అనేక మంది కెప్టెన్లు మారినా ఆ జట్టు తలరాత మారలేదు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలో పంజాబ్ కాస్త మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. 6 మ్యాచ్ లలో 2 గెలిచింది. శనివారం నాడు రాజస్థాన్ పై పోరాడి ఓడింది. అయితే, గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా కష్టంగానే నెగ్గింది. ఆదివారం భుజం గాయంతో ధావన్ ఆడలేదు. అతడు వారం రోజులు మైదానంలోకి దిగడని తెలుస్తోంది. జట్టు ప్రకారం చూస్తే ఫర్వాలేకున్నా.. మ్యాచ్ లను గెలిచేంత సత్తా మాత్రం లేదని స్పష్టమవుతోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, శామ్ కరన్ విఫలం అవుతున్నారు. శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ వంటి అన్ క్యాప్ డ్ భారత ఆటగాళ్లే వీరి కంటే మెరుగ్గా ఆడుతున్నారు. రబాడ (దక్షిణాఫ్రికా), అర్షదీప్ వంటి మంచి పేసర్లున్నా బ్యాటింగ్ లో పంజాబ్ చాలా వీక్ గా ఉంది. దీంతో ఆ జట్టు ముందుకెళ్లడం గగనమే.

ఢిల్లీ అదరగొట్టలేదు..

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్యం చేపట్టినా ఆ జట్టు ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. 6 మ్యాచ్ లకు గాను 2 మాత్రమే గెలిచిన ఢిల్లీ.. యువ ఓపెనర్ ప్రథ్వీ షాను మొదటినుంచి ఆడించకపోవడం చేసిన పెద్ద తప్పు. వార్నర్ వంటి ఆటగాడికి షా తోడైతే మ్యాచ్ ఫలితాలు మెరుగ్గా ఉండేవి. రన్ రేట్ (-0.975)లో కూడా ఢిల్లీ బాగా వెనుక ఉంది. పంత్ పుంజుకుని ఆడినా.. ఇప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్ష్ గాయంతో దూరమవడం ఢిల్లీకి మరింత దెబ్బ. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ వంటి పేసర్లను నమ్ముకుని మైదానంలో విజయం సాధించడం కష్టమే. దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ నోకియా పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. అక్షర్ పటేల్ తప్ప మరో మంచి స్పిన్నర్ లేకపోవడం ఢిల్లీకి చేటు చేస్తోంది.

కొసమెరుపు: ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సిన టోర్నీలో వరుసగా ఈ మూడు జట్లు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి. అది చాలా కష్టంతో కూడుకున్న పని.