సున్నా నుంచి సెంచరీకి.. తిలక్ చెప్పిన ఫన్నీ విషయం ఏమిటి?
ఈ కుర్రాడు కచ్చితంగా ఇండియాకు ఆడతాడు అని అనిపించింది.
By: Tupaki Desk | 16 Nov 2024 7:30 PM GMTటీమ్ ఇండియా టి20 ఫార్మాట్ లో తెలుగు వారికి చోటు కష్టమేనా..? టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమా..? ఆధునిక క్రికెట్ లో బాగా ఆదరణ పొందిన టి20లు ఆడే సత్తా తెలుగువారిలో లేదా.?? మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాల నుంచి దూకుడైన బ్యాట్స్ మన్ రాడా..? అంటే.. దీనికి సమాధానంగా నిలిచాడు 22 ఏళ్ల తిలక్ వర్మ. సరిగ్గా ఆరేళ్ల కిందటే తిలక్ పేరు హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈ కుర్రాడు కచ్చితంగా ఇండియాకు ఆడతాడు అని అనిపించింది. దానిని నిలబెట్టుకున్నాడు తిలక్.
తొలి తెలుగోడు.. మలి తెలుగోడూ..
భారత దేశానికి అజహరుద్దీన్ నుంచి విహారి వరకు మంచి బ్యాట్స్ మెన్ ను అందించిన తెలుగు రాష్ట్రాలు.. టి20 ఫార్మాట్ కు తగిన బ్యాట్స్ మన్ ను అందించడంలో వెనుకబడ్డాయి. అలాంటి స్థితిలో వచ్చిన తిలక్.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20లో సెంచరీ కొట్టాడు. దీంతో పొట్టి ఫార్మాట్ లో సెంచరీ కొట్టిన తొలి తెలుగోడిగా నిలిచాడు. ఇక శుక్రవారం జరిగిన నాలుగో టి20లోనూ తిలక్ సెంచరీ కొట్టి ‘మలి తెలుగోడు’గా నిలిచాడు. వీటన్నిటికీ మించి.. టి20ల్లో సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడు (22 ఏళ్ల 5 రోజులు)గా తిలక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అదే విజయ రహస్యం..
దక్షిణాఫ్రికా వంటి జట్టుపై దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ కొట్టడం అంటే మాటలు కాదు. కానీ, రెండు సెంచరీలు కొట్టాడు. దీనిని తాను ఎప్పుడూ ఊహించలేదన్నాడు తిలక్ వర్మ. కాగా, దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ లలో తిలక్ 280 పరుగులు చేశాడు. ఇందులో రెండు అజేయ సెంచరీలు ఉన్నాయి. 21 ఫోర్లు, 20 సిక్స్ లు కొట్టాడు. కాగా, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుతో పాటు మూడో, నాలుగో టి20ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తిలక్ కే దక్కింది. కాగా, నిరుడు దక్షిణాఫ్రికాలో పర్యటించిన జట్టులోనూ తిలక్ వర్మ ఉన్నాడు. కానీ, ఓ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. తాజాగా ఆ సంగతిని గుర్తు చేస్తూ.. ‘‘మీకో ఫన్నీ విషయం చెప్పాలనుంది. నిరుడు జోహెన్నెస్ బర్గ్ లో జరిగిన మ్యాచ్ లో తొలి బంతికే (గోల్డెన్) డకౌట్ అయ్యా. మళ్లీ అవకాశం వస్తే గట్టిగా నిరూపించుకోవాలని అనుకున్నా. ఇప్పడు సెంచరీ కొట్టి దానిని సాధించా’ అని వివరించాడు.
అతడి వెనుక సూర్య..
తిలక్ మూడో టి20లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను అడిగి మరీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. నాలుగో మ్యాచ్ లో నూ అలానే చేశాడు. దీంతో రెండు సెంచరీల అనంతరం అతడు సూర్య వైపు ముద్దులు పెట్టాడు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత జట్టు కోచ్ గా హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. ఓ దిగ్గజ బ్యాట్స్ మన్, అదీ సొంత ఊరికి చెందిన ఆటగాడి ఎదుట సెంచరీలు కొట్టడం అంటే.. తి‘లక్కీ’నే.