బ్రయాన్ లారా స్టేడియంలోనేడే హైదరాబాదీ తిలక్ వర్మ అరంగేట్రం?
వెస్టిండీస్ దీవుల్లోని తరౌబాలో దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రయాన్ లారా పేరిట ఉన్న స్టేడియం లో తిలక్ ఆడనున్నాడు. ఈ స్టేడియం లోని పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుంది.
By: Tupaki Desk | 3 Aug 2023 5:56 AM GMTసరిగ్గా ఐదేళ్ల కిందట ఆ కుర్రాడి పేరు హైదరాబాద్ క్రికెట్ సర్కిల్ లోనే పెద్దగా ఎవరికీ తెలియదు. అతడి పై స్టోరీ రాసే ఉద్దేశం లో అడ్రస్ కనుక్కోవడానికి రెండ్రోజులు పట్టింది. అలాంటి ఆటగాడు ఇప్పుడు టీమిండియా భవిష్యత్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. రెండు ఐపీఎల్ సీజన్ లతోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నేడు టి20 మ్యాచ్ ద్వారా తొలిసారి దేశానికి ఆడనున్నాడు. ఎంఎల్ జయసింహ, మొహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడనున్న హైదరాబాదీ బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలవనున్నాడు.
దిగ్గజ బ్యాట్స్ మన్ పేరిట ఉన్న స్టేడియం లో..
టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ తన అరంగేట్ర ముహూర్తం బాగుండాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి గొప్ప ముహూర్తమే హైదరాబాదీ బ్యాట్స్ మన్ తిలక్ వర్మకు దొరికింది. వెస్టిండీస్ తో గురువారం జరగనున్న తొలి టి20 మ్యాచ్ లో తిలక్ కు తుది జట్టులో ఆడే చాన్స్ దక్కనుంది. అతడు నాలుగో స్థానం లో బ్యాటింగ్ కు దిగే చాన్సుంది. అయితే, ఇక్కడే ఓ విశేషం ఉంది.
వెస్టిండీస్ దీవుల్లోని తరౌబాలో దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రయాన్ లారా పేరిట ఉన్న స్టేడియం లో తిలక్ ఆడనున్నాడు. ఈ స్టేడియం లోని పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుంది. భారత్, విండీస్ మధ్య చివరి వన్డే జరిగింది ఇక్కడే. టీమిండియా బ్యాటర్లు జట్టుకు 350 పైచిలు కు స్కోరు సాధించిపెట్టారు. బౌలర్లకు కూడా పిచ్ నుంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అవకాశముంటుంది.
ఇంతకుమించిన లక్కీ ఏముంటుంది?
కుడి చేతి వాటం బ్యాటర్లకు సచిన్ టెండూల్కర్ ఎంతటి ఆదర్శమో ఎడమచేతి వాట వారికి బ్రయాన్ లారా అంతటి ఆదర్శం. అందులోనూ లారా ప్రత్యేకతే వేరు. గొప్ప బౌలర్లంతా కొన్ని విషయాల్లో సచిన్ కంటే లారాకే ఎక్కువ మార్కులేస్తారు. ఆ కాలం లో సచిన్ తో సమఉజ్జీ ఎవరంటే లారానే అని చెప్పొచ్చు. అలాంటి బ్యాట్స్ మన్ పేరిట ఉన్న స్టేడియం లో అరంగేట్రం చేయడం అంటే లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మకు అంతకుమించిన లక్కీ చాన్స్ ఏముంటుంది?