Begin typing your search above and press return to search.

ఇదీ గంభీర్ మార్క్.. సీనియర్లకు షాక్.. తదుపరి వేటే..

ఇప్పుడు ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా బీసీసీఐ చెప్పినట్లు వినాల్సిందే.

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:26 AM GMT
ఇదీ గంభీర్ మార్క్.. సీనియర్లకు షాక్.. తదుపరి వేటే..
X

ఒకప్పుడు భారత జట్టులో స్టార్ కల్చర్ ఉండేది.. అంటే.. ఇలాంటి ఆటగాళ్లను ప్రత్యేకంగా చూడడం. విఫలమైనప్పటికీ కొనసాగించడం.. పదేపదే అవకాశాలు ఇవ్వడం నడిచేది. పోటీ తత్వం పెరగడం.. మీడియా ఫోకస్.. క్రికెట్ పాలనా వ్యవహారాల్లోనూ మార్పులు రావడంతో కాల క్రమంలో దీనికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా బీసీసీఐ చెప్పినట్లు వినాల్సిందే. నిరుడు దీనికి భిన్నంగా వ్యవహరించినందుకే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ జట్టు బయట కూర్చున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే..

కివీస్ కొట్టిన దెబ్బతో..

స్వదేశంలో చరిత్రలో తొలిసారి న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను ఓడిపోయింది టీమ్ ఇండియా. దీనికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పాల్సిన పనిలేదు. పైగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో ఇంత తక్కువ స్కోరుకు మన జట్టు ఆలౌట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక రెండో టెస్టులోనూ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్ స్పిన్ కు భారత బ్యాట్స్ మెన్ వద్ద సమాధానమే లేకపోయింది. కాగా, నవంబరు 1 నుంచి ముంబైలో జరగాల్సిన మూడో టెస్టులోనూ టీమ్ ఇండియా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. అక్కడి పిచ్ స్పిన్ కు అనుకూలం కాబట్టి.

గంభీర్ పై గురి..

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి వన్డే సిరీస్ లోనే శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత భారత జట్టు పరాజయం పాలవడం.. ఇప్పుడు స్వదేశంలో టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ కు కోల్పోవడంతో గౌతమ్ గంభీర్ అందరికీ టార్గెట్ అవుతున్నాడు. పైగా గంభీర్ ముక్కుసూటి మనిషి. దీంతో అతడి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కఠిన చర్యలకు సిద్దమయ్యాడు.

సీనియర్లూ.. ప్రాక్టీస్ తప్పనిసరి

టీమ్ ఇండియాలో సీనియర్లకు ఇప్పటివరకు ‘ఆప్షనల్ ట్రైనింగ్‌’ అవకాశం ఉండేది. అంటే.. సిరీస్‌ కు సన్నద్ధమయ్యే సందర్భంలో వీలైతేనే ప్రాక్టీస్ కు రావడం. ఇప్పుడు దీనిని గంభీర్ రద్దు చేశాడు. ఆటగాళ్లు అందరికీ ట్రైనింగ్‌ సెషన్ కచ్చితం చేశాడు. సీనియర్లలో స్టార్ క్రికెటర్ల కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలకు ఆప్షనల్ ప్రాక్టీస్ ఉండేది. పొరపాటున గాయపడితే జట్టుకు ఇబ్బంది అని ఈ అవకాశం ఇచ్చేవారు. వ్యక్తిగత పనుల కోసమూ కాస్త విశ్రాంతి ఇచ్చేవాళ్లు. అయితే, న్యూజిలాండ్ చేతిలో ఓటమితో జట్టులోని ప్రతి ఆటగాడు ప్రాక్టీస్ సెషన్‌ కు హాజరుకావాలంటూ గంభీర్ తేల్చిచెప్పాడట. కాగా, మూడో టెస్టుకు ముందు రెండు రోజుల ప్రాక్టీస్ సెషన్ ఉండనుంది. ఈ నెల 30, 31న అది జరగనుంది.

ఇక ఉపేక్ష లేదు

గంభీర్ తీరు చూస్తుంటే టీమ్ ఇండియా సీనియర్లపై వేటు కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలపై టెస్టు బ్యాటింగ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్ తో సిరీస్ లో రెండు టెస్టుల్లోనూ వీరు విఫలమయ్యారు. కీలకమైన సమయంలో పరుగులు చేయడంలో వీరు చేతులెత్తేస్తున్నారు. దీంతోనే మరో వైఫల్యం ఎదురైతే వేటు వేయడం కాదు కానీ.. విశ్రాంతి పేరుతో కాస్త పక్కనపెట్టడం గంభీర్ ఆలోచనగా కనిపిస్తోంది.