Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు వచ్చావే ‘ముక్కోణం’..? క్రికెట్ లో మళ్లీ.. అదీ పాక్ లో..

వాస్తవానికి టి 20లు వచ్చాక, లీగ్ లు మొదలయ్యాక ముక్కోణపు సిరీస్ లు అనేవి కనుమరుగు అయ్యాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఓ టోర్నీ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 10:21 AM GMT
ఎన్నాళ్లకు వచ్చావే ‘ముక్కోణం’..? క్రికెట్ లో మళ్లీ.. అదీ పాక్ లో..
X

ముక్కోణం.. ఈ కాన్సెప్ట్ తో తీసిన సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఇదే కాన్సెప్ట్ క్రికెట్ లోనూ సూపర్ హిట్టే.. ముగ్గురి మధ్య నడిచే ప్రేమ, మూడు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు.. చూసేందుకు భలే వినోదం అందిస్తాయి. వాస్తవానికి టి 20లు వచ్చాక, లీగ్ లు మొదలయ్యాక ముక్కోణపు సిరీస్ లు అనేవి కనుమరుగు అయ్యాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఓ టోర్నీ జరుగుతోంది.

ఆస్ట్రేలియా-భారత్-పాకిస్థాన్.. భారత్-పాకిస్థాన్-శ్రీలంక.. ఇలా గతంలో పలు ముక్కోణపు టోర్నీలు జరిగేవి. ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ కు ప్రత్యేక పేరు కూడా ఉండేది. గతంలో ముక్కోణపు టోర్నీ వస్తున్నందంటే సెలవులకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లినంత సంతోషంగా ఉండేది అభిమానులకు.

మూడు జట్లు హోరాహోరీగా తలపడడంతో, తరచూ జరిగే ఇలాంటి టోర్నీలతో కనువిందుగా అనిపించేంది.

మూడు మంచి జట్లే అయితే.. ఫైనల్ బెర్తు ఎవరికి దక్కుతుంది? అనేది అప్పట్లో మంచి మజా ఇచ్చేది. దీనికోసం రన్‌ రేట్‌ ను చూసేవారు. అప్పటికీ చాలాసార్లు చివరి మ్యాచ్ తో ఫైనల్ బెర్తు ఖరారయ్యేది. అయితే, వన్డేల్లో 2019 తర్వాత ముక్కోణపు టోర్నీలు ఆగిపోయాయి. చివరగా బంగ్లాదేశ్, ఐర్లాండ్, వెస్టిండీస్‌ తలపడ్డాయి.

పాక్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత

అసలు ద్వైపాక్షిక సిరీస్ లే జరగని పాకిస్థాన్ ఇప్పుడు ఆసక్తికరమైన ముక్కోణపు టోర్నీ జరగబోతోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య శనివారం నుంచి టోర్నీ జరగనుంది. ఈ నెల 19 నుంచి వన్డే ఫార్మాట్లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా అన్నట్లు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

చాంపియన్స్‌ ట్రోఫీ కోసం అని డెవలప్ చేసిన లాహోర్, కరాచీ స్టేడియాల్లో ముక్కోణపు సిరీస్‌ మ్యాచ్‌ లు జరుగుతాయి. శనివారం పాక్ - న్యూజిలాండ్‌ తలపడతాయి. ఒక్కో జట్టు ఇతర జట్లతో ఒక్కసారి తలపడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌ చేరతాయి. రెండు కంటే ఎక్కువ జట్లు పాకిస్థాన్‌ లో ఒక సిరీస్‌ లో ఆడడం 2012 ఆసియా కప్‌ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.