హార్దిక్.. ఇది కెప్టెన్ పనికాదు.. కుర్రాడి విషయంలో ఇలానా చేసేది?
స్ట్రయికింగ్ లో హార్దిక్ పాండ్యా. ఒక్క పరుగు తీసి తిలక్ కు ఇచ్చినా అతడు అర్ధ సెంచరీ పూర్తి చేసుకునే వీలుండేది.
By: Tupaki Desk | 9 Aug 2023 6:34 AM GMT"ఇది అత్యంత ద్వేషించే సిక్స్.. ఇలాంటి స్వార్థ ఆటగాడిని ఎప్పుడూ చూడలేదు.. ఇప్పటివరకు చూసినవారిలో అతడే అత్యంత స్వార్థ ఆటగాడు.. ఒకసారి సంజూ శాంసన్ ఏం చేశాడో చూడు..?" ఇవి టీమిండియా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెట్టింట జరుగుతున్న ట్రోలింగ్. బహుశా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఇంత దారుణమైన ట్రోలింగ్ ఏ క్రికెటర్ మీద ఇటీవలి కాలంలో జరిగి ఉండదేమో??? ఔను.. మంగళవారం నాటి వెస్టిండీస్ తో మూడో టి20 చూశాక ఎవరికైనా ఇంతే అనిపించింది.
కుర్రాడిలో స్ఫూర్తినింపేదెలాగ..?
టీమిండియాలో ఎక్కువగా ట్రోలింగ్ కు గురయ్యేది టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్య. తాజా మ్యాచ్ అనంతరం కూడా ఇదే జరిగింది. వాస్తవానికి మ్యాచ్ లో సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు హార్దిక్. దీనికి అందరూ అభినందించాలి కానీ.. అతడిని నిందిస్తున్నారు. దీనికి పెద్ద కారణమే ఉంది. వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తలపడుతున్న టీమిండియా రెండు మ్యాచ్ లు ఓడింది. మూడో టి20లోనూ ఓడితే సిరీస్ పోయేది. అంటే సిరీస్ నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్.
360 డిగ్రీ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ (83) దూకుడు, హైదరాబాదీ తిలక్ వర్మ (49 నాటౌట్ ) చక్కటి ఇన్నింగ్స్ జట్టును గెలిపించాయి. అయితే, ఫినిషింగ్ టచ్ మాత్రం కెప్టెన్ హార్దిక్ పాండ్య (20 నాటౌట్)దే. అలా 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలోనే ఛేదించింది.
విజయానికి 2 పరుగులు.. తిలక్ కు 1 పరుగు
టీమిండియా విజయానికి చేయాల్సింది 2 పరుగులు. ఇంకా 14 బంతులున్నాయి. అటు హైదరాబాదీ తిలక్ వర్మ 49 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. స్ట్రయికింగ్ లో హార్దిక్ పాండ్యా. ఒక్క పరుగు తీసి తిలక్ కు ఇచ్చినా అతడు అర్ధ సెంచరీ పూర్తి చేసుకునే వీలుండేది. కానీ, పాండ్యా లాఫ్టెడ్ షాట్ తో సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. ఇదే అభిమానుల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మరొక్క పరుగు చేస్తే తిలక్ ఖాతాలో వరుసగా రెండో అర్థ సెంచరీ నమోదయ్యేది. ఓ 20 ఏళ్ల కొత్త
కుర్రాడికి ఇంతకంటే కావాల్సిన ఆత్మవిశ్వాసం ఏముంటుంది? కానీ ఆ అవకాశాన్ని కెప్టెన్ అయి ఉండి హార్దిక్ ఇవ్వలేదు.
దీంతో అతడు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు.
కెప్టెన్ గా నువ్వు ఎదగాలి హార్దిక్..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే ఆరోపణలున్నాయి. కాస్త దూకుడుగా ఒంటెత్తు పోకడలు కనిపిస్తున్నాయనే అపవాదూ ఉంది. దీనిని రుజువు చేసేలానే అతడి తీరు కనిపిస్తోంది. తిలక్ లాంటి కుర్రాడు 49 పరుగుల మీద ఉండగా.. అతడే మ్యాచ్ ను ముగించడం దీనినే సూచిస్తోంది. కెప్టెన్ స్థాయిలో ఉన్న ఆటగాడు చేయాల్సిన పనికాదనే వాదన వస్తోంది.
ఈ నేపథ్యంలో.. "నువ్వేమీ చివరి బంతి ఆడడం లేదు కదా..? అయినా నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా?" అంటూ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. పనిలో పనిగా.. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 20 ఏళ్ల కిందటి ఘటననూ గుర్తు చేస్తున్నారు. ద్రవిడ్ 2004 లో పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన ఉదంతంతో ప్రస్తుతం హార్దిక్ ఆటను పోల్చుతున్నారు. పాక్ లోని ముల్తాన్ గడ్డపై సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్, 52 పరుగుల తేడాతో గెలిచింది. కానీ, సచిన్ డబుల్ సెంచరీ ముంగిట ద్రవిడ్ తీసుకున్న నిర్ణయంపై మాత్రం పెద్ద దుమారం రేగింది.