2024 టి20 వరల్డ్ కప్.. రోహిత్ ఓకే.. అతడికి నో.. బిగ్ షాక్
2007లో తొలి టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది. మళ్లీ ఆ ఫార్మాట్ లో ప్రపంచ విజేతగా నిలవలేదు.
By: Tupaki Desk | 1 Dec 2023 4:30 PM GMTప్రస్తుతం టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మన్ ఎవరు? అత్యంత ఫిట్ నెస్ తో ఉన్నదెవరు..? పోనీ వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తగల వారు ఎవరు..? యోయో టెస్టులో అత్యధిక మార్కులు తెచ్చుకోగలవారెవరు..? ప్రపంచంలో ఎక్కడైనా పరుగులు సాధించగలవారు ఎవరు..? ఆఖరికి పొట్టి క్రికెట్ కూ తగినట్లు ఆడగల బ్యాట్స్ మన్ ఎవరు...? వీటన్నిటికీ ఒకటే సమాధానం.. విరాట్ కోహ్లి. కానీ, అతడికి సెలక్టర్లు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. అయితే, ఇందులో ఓ ట్విస్టుంది.
17 ఏళ్లకైనా కల తీరుతుందా?
2007లో తొలి టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది. మళ్లీ ఆ ఫార్మాట్ లో ప్రపంచ విజేతగా నిలవలేదు. విచిత్రం ఏమంటే.. 2008లో ఐపీఎల్ మొదలైంది. ఈ లీగ్ లేనప్పుడు ప్రపంచ విజేతగా నిలిచిన భారత్.. అత్యంత పోటీ ఉన్న లీగ్ మొదలయ్యాక మాత్రం విఫలమవుతోంది. అయితే, ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. అందుకనే కెప్టెన్ రోహిత్ శర్మను మళ్లీ జట్టులోకి తీసుకుంటోంది. వాస్తవానికి నిరుటి టి20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరినీ పొట్టి ఫార్మాట్ కు పరిగణించడం లేదు. వయసు పైబడడం రీత్యా వారు కూడా ఓ విధంగా స్వచ్ఛందంగా తప్పుకొన్నారని భావించాలి.
రోహిత్ ను రమ్మని పిలిచి.. కోహ్లిని వద్దని
రోహిత్ దాదాపు 15 నెలలు అవుతోంది అంతర్జాతీయ టి20 ఆడక. కానీ, అతడిని వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాల్లో జరిగే టి20 ప్రపంచ కప్ సారథిగా నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉందట. మొన్నటి వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ సారథ్యం తీరు చూశాక ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. కాగా, మరి రోహిత్ ను పిలుస్తున్నట్లుగా కోహ్లికీ పిలుపు వెళ్తుందా..? అంటే అదేమీ లేదని స్పష్టమవుతోంది. కోహ్లిని టి20 ప్రపంచ కప్ నకు తీసుకోవడం లేదని సమాచారం. ఈ విషయం అతడికి తెలియజేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
కుర్రాళ్ల రాకతో..
శుబ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్ల జోరుతో కోహ్లిని టి20లకు పరిగణించడం లేదు. అయితే, కోహ్లి కంటే ఏడాది పెద్ద అయిన రోహిత్ ను మాత్రం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. అదేమంటే కెప్టెన్సీ. టి20ల్లో ఏడాదిగా భారత్ కు సారథ్యం వహిస్తున్న పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అతడికి తరచూ గాయాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ, అతడి కంటే రోహిత్ సమర్థుడు అని భావించి పగ్గాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కోహ్లికి జైశ్వాల్, గిల్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. రోహిత్ కెప్టెన్సీకి ప్రత్యామ్నాయం లభించలేదు.