భారత క్రికెట్లో కొత్త ‘ఉదయం’.. చరిత్రకు ఒక్క అడుగే
భారత అండర్ 19 క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచ కప్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది.
By: Tupaki Desk | 8 Feb 2024 7:16 AM GMT81, 100, 34, 35, 75, 64, 50, 74, 112.. ఇవీ ఓ బ్యాట్స్ మన్ గత 9 ఇన్నింగ్స్ ల్లో స్కోర్లు. అత్యంత నిలకడ.. సంయమనం.. సహనం.. ఒత్తిడిని ఎదుర్కొనే సత్తా.. టెక్నికల్ గా సౌండ్ అయితేనే ఈ స్థాయిలో రాణించడం సాధ్యం. మరింతటి ప్రతిభ చూపుతున్న క్రికెటర్ ఓ కెప్టెన్ కావడం విశేషం అయితే.. అతడు భారతీయుడు కావడం మరింత విశేషం. అతడు చరిత్రకు ఒక్క అడుగు దూరంలో ఇంకాస్త విశేషం.
భారత అండర్ 19 క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచ కప్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. అత్యంత ఒత్తిడి ఎదురైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో వచ్చిన సచిన్ దాస్ (95 బంతుల్లో 96, 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ప్రతిభ కనబరిచాడు. కానీ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం కెప్టెన్ ఉదయ్ సహారన్ కు దక్కింది. ఇతడు చేసింది 81 పరుగులే. 124 బంతులు ఆడాడు. అయినా అతడికే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, దీనికో కారణం ఉంది. మ్యాచ్ లో ఉదయ్ చూపిన సంయమనమే అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేలా చేసింది.
భవిష్యత్ కెప్టెన్ కూల్..
245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. కానీ, అదే సమయంలో ఉదయ్ అత్యంత నిబ్బరంగా నిలిచాడు. మరొక్క వికెట్ పడినా జట్టుకు కష్టాలు తప్పవని గ్రహించి బంతులు వేస్ట్ అయినా ఫర్వాలేదని భావించి క్రీజులో అతుక్కుపోయాడు. తన తర్వాత వచ్చిన సచిన్ కు భరోసా కల్పించాడు. అందుకనే ఉదయ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కాగా, బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణిసత్ కెప్టెన్ గానూ జట్టును ముందుకునడిపిస్తున్న అతడిని అందరూ ‘కెప్టెన్ కూల్’ అంటున్నారు. దీంతోనే భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు.
టోర్నీ టాపర్ అతడే..
6 మ్యాచ్ లు.. 64.83 సగటు.. 389 పరుగులు.. ఇదీ అండర్ 19 ప్రపంచ కప్ లో ఉదయ్ ప్రదర్శన. టోర్నీ టాపర్ అతడే. ఒక సెంచరీ సహా మూడు అర్ధ సెంచరీలు కొట్టాడు. ఫైనల్లోనూ ఉదయ్ రాణించి దేశానికి ప్రపంచ కప్ అందించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే, సరిగ్గా ఏడాది కిందట ఉదయ్ పరిస్థితి వేరు.
ఇప్పుడు ప్రపంచ కప్ లో సారథిగా ఉన్న అతడు నిరుడు అండర్-19 ఆసియాకప్ (2023)కు అయినా ఎంపికవుతాడా లేదా అని తండ్రి సంజీవ్ ఆందోళన చెందాడు. ఆ టోర్నీలో సరిగా రాణించని ఉదయ్ గురిచి తండ్రి బెంగ పెట్టుకున్నాడు. అయితే, దీనికి ఉదయ్ మాత్రం చలించలేదు. ‘తొందరొద్దు నాన్నా.. పరుగులు అవే వస్తాయి’ అని తండ్రికి సమాధానం ఇచ్చాడు. కాగా, ఉదయ్ కుటుంబానిది రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్. దేశవాళీల్లో మాత్రం అతడు పంజాబ్ కు ఆడుతున్నాడు. కాగా, ఉదయ్ తండ్రి సంజీవ్ ఆయుర్వేద వైద్యుడు. బీసీసీఐ లెవల్ వన్ కోచ్ కూడా.
వారి సరసన నిలుస్తాడా?
భారత్ కు అండర్ 19 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్లు మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్, ప్రథ్వీషా, యశ్ ధుల్. వీరి సరసన చేరేందుకు ఇప్పుడు ఉదయ్ కు అవకాశం దక్కింది. మరొక్క విజయం సాధిస్తే అతడు చరిత్రలో నిలిచిపోతాడు. ఇప్పటికే కొందరు ఉదయ్ ను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. మరి అతడు ఫైనల్లో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
కొసమెరుపు: రాజస్థాన్ నుంచి క్రికెట్ కోసం ఉదయ్ కుటుంబం పంజాబ్ లోని ఫజిల్కాకు మారింది. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఊరు కూడా ఇదే.