Begin typing your search above and press return to search.

కేటీఆర్ క్రికెట్ స్టేడియం చూశారా? మరీ ఇంత యాకీనా?

ప్రపంచ కప్ టోర్నీ నేపథ్యంలో బీసీసీఐ భారీగా ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం విషయానికే వస్తే రూ.117 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలున్నాయి.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:15 AM GMT
కేటీఆర్ క్రికెట్ స్టేడియం చూశారా? మరీ ఇంత యాకీనా?
X

క్రికెట్ ను మతంగా ఫీలయ్యే ప్రజలున్న దేశంలో ప్రపంచ కప్ టోర్నీ మొదలవుతుందంటే దాని వ్యవహారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబరు మూడుతో వార్మప్ మ్యాచ్ లు పూర్తి కావటం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ టోర్నీ సంరంభం మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

దేశంలోని పది ప్రముఖ నగరాల్లో వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా బీసీసీఐ గొప్పగా చెబుతోంది. సర్వం సన్నద్ధం అంటూ ఉదరేస్తున్న ప్రచార వేళ.. పది స్టేడియంలో ఒకటైన ఉప్పల్ స్టేడియంను చూసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు. అంతర్జాతీయ టోర్నీ సందర్భంగా స్టేడియం నిర్వహణఇంత అధ్వానంగా ఉండటమా? అంటూ షాక్ తింటున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు వరల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి. అక్టోబరు 6న పాక్ - నెదర్లాండ్స్, అక్టోబరు 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్, అక్టోబరు 10న పాక్ - శ్రీలంక మధ్య మ్యాచ్ లకు హైదరాబాద్ వేదిక కానుంది. వీటికి ముందు రెండు వార్మప్ మ్యాచ్ లను కూడా నిర్వహించారు. తాజాగా నిన్న (మంగళవారం) ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.

ప్రపంచ కప్ టోర్నీ నేపథ్యంలో బీసీసీఐ భారీగా ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం విషయానికే వస్తే రూ.117 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలున్నాయి. మరి.. ఆ స్థాయిలో ఖర్చు చేసిన వేళ.. స్టేడియం తళతళలాడాల్సింది పోయి.. పావురాల రెట్టలతో కుర్చీలు దర్శనమిస్తూ.. యాకీ అన్న మాట నోటి నుంచి వచ్చేలా ఎందుకు ఉన్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ముగిసిన వార్మప్ మ్యాచ్ ను చూసేందుకు భారీ ఎత్తున ప్రేక్షకులు స్టేడియంకు వెళ్లి.. తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు వెళ్లిన వారు.. నోరెళ్లబెట్టిన పరిస్థితి. కనీసం కూర్చునేందుకు వీల్లేని విధంగా కుర్చీలు మొత్తం పక్షి విసర్జితాలతో.. దారుణంగా ఉన్న వైనాన్ని చూస్తే.. స్టేడియం ఆధునీకీకరణ కోసం పెట్టిన ఖర్చు.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీంతో.. స్టేడియంలో వసతులు ఏ మాత్రం బాగోలేవంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారి.. హైదరాబాద్ పరువు మూసీలో పోసినట్లుగా మారింది. చివరకు క్రికెటర్లు సైతం స్టేడియంలోని పరిస్థితిపై మండిపడుతున్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివర్ణించే ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడు కేటీఆర్.. వరల్డ్ కప్ టోర్నీకి తమ నగరం అతిధ్యం ఇస్తున్న వేళ.. ఉప్పల్ స్టేడియంలోని పరిస్థితి గురించి ఎందుకు ఫోకస్ పెట్టనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.