Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ లో ‘ఇండియా H1b టీం ’.. పాక్ ను వెళ్లగొట్టింది!

సగంమంది విదేశీ సంతతి ఆటగాళ్లే.. కొందరైతే హెచ్ 1బీ వీసా మీద వచ్చినవారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:01 AM GMT
ప్రపంచ కప్ లో ‘ఇండియా H1b టీం ’.. పాక్ ను వెళ్లగొట్టింది!
X

సగంమంది విదేశీ సంతతి ఆటగాళ్లే.. కొందరైతే హెచ్ 1బీ వీసా మీద వచ్చినవారు. ఇంకొందరు ఉద్యోగాలు చేస్తూనే క్రికెట్ లో కొనసాగుతున్నవారు.. ఇలాంటివారితో కూడిన జట్టు అద్భుతం చేసింది.. అదికూడా ప్రపంచ కప్ లో..

ఆ జట్టుకు షాకిచ్చి.. వెళ్లగొట్టి..

టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశ నుంచి సూపర్ 8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. లీగ్ దశలో మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను అమెరికా సూపర్ ఓవర్ లో ఓడించిన సంగతి తెలిసిందే. అనంతరం పాకిస్థాన్.. భారత్ మీద కూడా ఓడిపోవడంతో సూపర్-8 అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పుడు తాజాగా అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అమెరికా(ఇండియా H1b టీం అని మన వాళ్ళు ముద్దు గా పిలుచుకొంటున్న సంగతి తెలిసిందే)నేరుగా సూపర్-8కు చేరింది.

సభ్య దేశం కాకుండా..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో అమెరికా సభ్య దేశం కాదు.

‘అసోసియేట్’ దేశం మాత్రమే. ఇంకా సభ్యత్వ హోదా దక్కలేదు. ఇప్పుడు ఒక ప్రపంచ కప్ లో సూపర్ 8 చేరిన ఏడో దేశంగా అమెరికా రికార్డు సాధించింది. గతంలో ఐర్లాండ్(2009), నెదర్లాండ్స్ (2014, 2022), అఫ్ఘానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021) మాత్రమే ఈ ఘనత సాధించాయి. కాగా, తాజా విజయంతో అమెరికా.. 2026లో భారత్-శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే టి20 ప్రపంచ కప్ నకు అమెరికా అర్హత సాధించింది.

పాక్ ను దెబ్బకొట్టిన వాన..

టి20 ప్రపంచ కప్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ కు ఊహించని పరిణామం ఎదురైంది. గ్రూప్‌-ఏలో ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో వాటికి చెరో పాయింట్‌ ఇచ్చారు. నాలుగు మ్యాచ్‌ లలో ఐదు పాయింట్లతో అమెరికా సూపర్‌-8కు వెళ్లింది. పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌ లలో ఒకటే విజయంతో రెండు పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌ తో ఆదివారం ఆడనుంది. ఇందులో గెలిచినా నాలుగు పాయింట్లే అవుతాయి.

సూపర్ 8కు చేరిన అమెరికా వచ్చే బుధవారం దక్షిణాఫ్రికాతో, శుక్రవారం వెస్టిండీస్‌ తో తలపడనుంది. జూన్‌ 23న B1 (ఇంగ్లాండ్‌/స్కాట్లాండ్‌)లతో ఆడనుంది.