క్రికెటర్ల వయసు మోసం నిజమేనా? దానికి ఉన్న పరీక్షేంటి?
ఇదే సమయంలో పాకిస్థాన్ కే చెందిన హసన్ రాజా అనే కుర్రాడి గురించి కూడా పెద్ద దుమారం రేగింది.
By: Tupaki Desk | 26 Nov 2024 10:05 AM GMTభారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసుకే టీమ్ ఇండియాలోకి వచ్చేశాడు. 1989లో ఇదో సంచలనం. ఆపై 24 ఏళ్ల పాటు తిరుగులేని విధంగా ఆడాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాకపోతే పాకిస్థాన్ కు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది కూడా 16 ఏళ్ల వయసుకే అరంగేంట్ర చేశాడు. 1996లో ఇది కూడా సంచలనమే. అయితే, అప్పట్లో ఆఫ్రిది ఆకారం చూసినవారు ఎవరూ అతడికి 16-17 ఏళ్లు మాత్రమే ఉంటాయని భావించలేదు. అయితే, ఆ వివాదం పెద్దది కాకుండానే సమసిపోయింది. ఆఫ్రిది వయసుపై మరెప్పుడూ చర్చ జరగలేదు. ఇదే సమయంలో పాకిస్థాన్ కే చెందిన హసన్ రాజా అనే కుర్రాడి గురించి కూడా పెద్ద దుమారం రేగింది. సచిన్ రికార్డు బద్దలు కొట్టడానికా అన్నట్లు కేవలం 14 ఏళ్ల వయసులో అతడిని పాకిస్థాన్ జట్టులోకి తీసుకున్నారు. ఇతడిపైనా ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు వచ్చాయి. 1982 మార్చిలో పుట్టిన హసన్ 1996 అక్టోబరు నాటికి (అంటే 14 ఏళ్ల 7 నెలలు) పాకిస్థాన్ తరఫున మ్యాచ్ ఆడాడు. కానీ, హసన్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. పాకిస్థాన్ కు 7 టెస్టులు, 16 వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.
సర్ఫరాజ్ పైనా ఆరోపణలు
ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్టు జట్టు సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్ వయసు పైనా గతంలో ఆరోపణలు వచ్చాయి. 2011లో ఓ స్కూల్ జట్టు.. సర్ఫ రాజ్ కు 15 ఏళ్లు ఉంటాయని, కానీ 13 ఏళ్ల వాడిగా చూపుతూ ఆడిస్తున్నారని ఆరోపించించింది. తర్వాత పరీక్షల్లో సర్ఫ ఏజ్ సరైనదేనని తేలింది.
ఇప్పుడు బిహార్ కుర్రాడిపై..
‘మా బాబుకు 13 ఏళ్లే..టెస్టుకు సిద్ధం..’’ అంటూ ఐపీఎల్ సెన్సేషన్ తండ్రి. శని, ఆదివారాల్లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో తొలి రోజు టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు రూ.27 కోట్లు దక్కడం సంచలనమైతే.. రెండో సంచలనం వైభవ్ సూర్యవంశీ. బిహార్ కు చెందిన ఈ కుర్రాడి వయసు 13 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ.1.10 కోట్లకు వేలంలో దక్కించుకుంది. దీంతో వైభవ్ పేరు మార్మోగుతోంది. ఒకవేళ రాజస్థాన్ తుది జట్టులో చోటు దక్కితే యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ తో కలిసి వైభవ్ ఆడతాడు.
సంచలనం వెనుకే దుమారం..
మెగా వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్.. 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో 100 పరుగులు చేశాడు. అక్టోబరులో ఆస్ట్రేలియా అండర్-19తో యూత్ టెస్టులోనూ ఆడాడు. 62 బంతుల్లోనే సెంచరీ (104 పరుగులు) చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఎంపిక చేయడంతో ఎడమచేతి వాటం వైభవ్.. అతి త్వరలోనే టీమ్ ఇండియాకు ఆడతాడని భావిస్తున్నారు. కానీ, ఇతడి వయసు 15 ఏళ్లు అని ఆరోపణలు వస్తున్నాయి.
కాదు 13 మాత్రమే..
తన కుమారుడి వయసు వివాదంపై వైభవ్ తండ్రి సంజీవ్ స్పందించారు. వైభవ్ కు ఎనిమిదేళ్ల వయసులోనే బీసీసీఐ ఎముక పరీక్ష చేసిందని తెలిపారు. మళ్లీ పరీక్షకు సిద్ధం అని పేర్కొన్నారు. 8 ఏళ్ల వయసులోనే అండర్-16 జిల్లా ట్రయల్స్ లో రాణించాడని.. బిహార్ లోని సమస్తిపుర్ క్రికెట్ అకాడమీలో రాటుదేలాడని వివరించారు. వైభవ్ క్రికెటర్ గా ఎదిగేందుకు భూమిని అమ్మేశానని పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టానని తెలిపారు. తాము ఎవరికీ భయపడమని.. అవసరమైతే మళ్లీ ఎముక పరీక్ష చేయించుకోవచ్చని చెప్పారు.
ఏమిటీ ఎముక పరీక్ష?
క్రికెటర్లనే కాదు ఒక వ్యక్తి వయసు కచ్చితంగా నిర్ధారణ ఎముక పరీక్ష ద్వారా తేలుతుంది. మరీ ముఖ్యంగా క్రీడల్లో వయసు మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువ వయసు వారు తక్కువ వయసు కేటగిరీల్లో ఆడేందుకు ఇలా చేస్తుంటారు. అందుకే ఎముక పరీక్ష ద్వారా కచ్చితమైన వయసును తేలుస్తుంటారు.