పిల్లాడు.. కుర్రాళ్ల మ్యాచ్ లో అదరగొట్టాడు.. ఫైనల్ చేర్చాడు..
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్ లో ఇటీవల మార్మోగుతున్నపేరు. అటు ఇటుగా 12 ఏళ్లకే రంజీ ట్రోపీ అరంగేట్రం చేసిన ఈ బిహారీ బాలుడు..
By: Tupaki Desk | 7 Dec 2024 7:45 AM GMTవైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్ లో ఇటీవల మార్మోగుతున్నపేరు. అటు ఇటుగా 12 ఏళ్లకే రంజీ ట్రోపీ అరంగేట్రం చేసిన ఈ బిహారీ బాలుడు.. వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత నెలలో జరిగిన మెగా వేలంలో వైభవ్ ను ఆ ఫ్రాంచైజీ రూ.1.10 కోట్లకు తీసుకుంది. అదే జరిగితే టీనేజీ మొదట్లోనే (13 ఏళ్లకు) అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడిన రికార్డును సాధిస్తాడు.
పాకిస్థాన్ పై విఫలమైనా..
13 ఏళ్ల వైభవ్ కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన సిరీస్ లో ఆడాడు. ఇప్పుడు అండర్ 19 ఆసియా కప్ లోనూ పాల్గొంటున్నాడు. అయితే, తొలుత పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. 281 పరుగుల భారీ టార్గెట్ తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఛేదనకు దిగిన సమయంలో వైభవ్ పై ఎన్నో ఆశలున్నాయి. కానీ, అతడు విఫలమయ్యాడు. దీంతో జట్టు కూడా ఓటమిపాలైంది. అయితే, ఆ తర్వాత జపాన్ (23), యూఏఈ (76 నాటౌట్)లపై రాణించాడు.
లంక మీద దుమ్మురేపాడు..
ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇక వైభవ్ సూర్యవంశీ (67; 36 బంతుల్లో 6×4, 5×6) చెలరేగాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్ లతో పరుగుల వేట కొనసాగించాడు. దీంతో ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను భారత్ ఓడించి ఫైనల్ చేరింది. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో వైభవ్ టి20 తరహాలో ఆడాడు. టార్గెట్ 174 పరుగులు కాగా.. అతడి ధాటికి భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 21.4 ఓవర్లలోనే గెలిచేసింది. రెండో ఓవర్లోనే మూడు సిక్సర్లు, ఫోర్ తో వైభవ్ దూకుడు చూపాడు.
మరో ఓపెనర్ ఆయుష్ మాత్రె (34; 28 బంతుల్లో 7×4) డా రాణించాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 8.3 ఓవర్లలోనే 91 పరుగులు చేసింది. ఆయుష్ ఔటయ్యాక వైభవ్ మరింత దూకుడు చూపాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు.
ఫైనల్ పాక్ తోనేనా?
లీగ్ దశలో భారత్ ను ఓడించిన పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుందా? అదీం అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోనేనా? దీనికి చాన్సు లేదు. ఎందుకంటే.. మొదటి సెమీఫైనల్లో పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ ఓడించింది. పాక్ 116 పరుగులకే ఆలౌట్ కాగా.. బంగ్లా 21.1 ఓవర్లలోనే 120 పరుగులు చేసి గెలిచింది.