Begin typing your search above and press return to search.

వరుణ్ చక్రవర్తి..నాడు భారత్ కు రావొద్దని బెదిరింపులు..నేడు పూలదండలు

వరుణ్ చక్రవర్తి.. టీమ్ ఇండియా నయా సంచలనం.. 33 ఏళ్ల వరుణ్ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు.

By:  Tupaki Desk   |   15 March 2025 8:00 PM IST
వరుణ్ చక్రవర్తి..నాడు భారత్ కు రావొద్దని బెదిరింపులు..నేడు పూలదండలు
X

వరుణ్ చక్రవర్తి.. టీమ్ ఇండియా నయా సంచలనం.. 33 ఏళ్ల వరుణ్ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అతడి మిస్టరీ స్పిన్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మన్ కు సవాల్ గా మారింది. ఎక్కడ పడి ఎక్కడ తిరుగుతుందో అర్ధం కాని బంతికి అడ్డంగా దొరికిపోయారు. వాస్తవానికి వరుణ్ ను అందరూ టి20 బౌలర్ గానే చూశారు. వన్డే ఫార్మాట్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో తొలుత ఆడించలేదు. అయితే, పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం మొదలయ్యాక టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా వరుణ్ ను రంగంలోకి దించాడు. అతడు తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థుల వెన్నువిరిచాడు.

ఆడిన మూడు చాంపియన్స్ ట్రోఫీ వన్డేల్లో 9 వికెట్లు తీశాడు వరుణ్. తొలి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ (న్యూజిలాండ్ త్) లోనే 5 వికెట్లు పడగొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సెమీస్ లో రెండు, ఫైనల్లో న్యూజిలాండ్ పై మరో రెండు వికెట్లు తీశాడు. దీన్ని బట్టే వరుణ్ చాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పాత్ర పోషించాడో చెప్పవచ్చు.

కాగా, ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లేకుండా టీమ్ ఇండియా వన్డే జట్టును ఊహించలేని పరిస్థితి. అయితే, అలాంటి వరుణ్ కు ఒకప్పుడు భారత్ కు రావొద్దని బెదిరింపులు వచ్చాయట. 2021లో జరిగిన టి20 ప్రపంచ కప్ తర్వాత ఈ పరిస్థితి ఎదురైందట.

2021లో టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లు అక్టోబరు 17-నవంబరు 14 మధ్యన జరిగాయి. వాస్తవానికి ఈ టోర్నీని భారత్ నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా యూఏఈకి మార్చారు. ఈ ప్రపంచ కప్‌లో 16 జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన ఈ టోర్నీలో.. టీమ్ ఇండియాకు దిగ్గజ క్రికెటర్ ధోనీ మెంటార్ గా వ్యవహరించాడు. కానీ, భారత్ కనీసం సెమీఫైనల్ కు కూడా చేరలేదు. దీంతో ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అప్పుడే వరుణ్ కూ బెదిరింపులు వచ్చాయి. చెన్నై చేరుకున్నాక తనను ఇంటివరకు ఫాలో అయ్యారని, నమ్మకంతో జట్టుకు ఎంపిక చేస్తే దానిని నిలబెట్టుకోలేకపోయాననే వేదన వెంటాడిందని వరుణ్ చెప్పుకొచ్చాడు.