Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ రూల్స్ చెప్పేదిదే వినేశ్‌ స్థానంలో ఫైనల్స్‌ కు ఎవరంటే ?

అలా అని ఈ రోజు వినేశ్ తలపడనున్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డర్ బ్రాంట్ కు స్వర్ణపతకం ఏమీ ఖాయం కాలేదని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 1:44 PM GMT
ఒలింపిక్స్  రూల్స్  చెప్పేదిదే  వినేశ్‌  స్థానంలో ఫైనల్స్‌  కు ఎవరంటే ?
X

ఒక్కసారిగా భారతీయుల గుండెల్లో బాంబు పడింది! పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగాట్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో ఒలింపిక్స్ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో... ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఈ సమయంలో ఆమె స్థానంలో ఫైనల్స్ కు ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును.. పారిస్ ఓలింపిక్స్ లో వినేశ్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. అలా అని ఈ రోజు వినేశ్ తలపడనున్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డర్ బ్రాంట్ కు స్వర్ణపతకం ఏమీ ఖాయం కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ద్వితీయ స్థానంలో రజత పతకం ఎవరికి దక్కుతుందనే విషయం మాత్రం ఇంకా తేలలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూ.డబ్ల్యూ.డబ్ల్యూ) ఫెడరేషన్ నిబంధనల ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని క్రీడాకారిణిపై అనర్హత వేటు వేయడంతోపాటు.. సదరు పోటీల్లో ఆమెకు చివరి ర్యాంక్ ఇస్తారు. అంటే... ఫైనల్ వరకూ వచ్చి వెనుదిరిగినప్పటికీ వినేశ్ కు రజత పతకం ఇవ్వరన్నమాట. ఈ నేపథ్యంలో మరి ఫైనల్ పోటీ ఎవరి మధ్య జరగబోతోందనేదీ ఆసక్తిగా మారింది.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ రెజ్లింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 11 ప్రకారం... క్వార్టర్ ఫైనల్స్ లో వినేశ్ చేతిలో 5 - 0 తేడాతో ఘోరంగా ఓటమి పాలైన క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్ కు.. ఫైనల్ లో వినేశ్ తో పోటీపడనున్న అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ కు మధ్య ఫైనల్ జరగనుంది. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రోజు రాత్రి 11:23కి ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది!

100 గ్రాములు ఎక్కువున్నా ఆడనిస్తారు!:

ఎవరు ఫైనల్ ఆడతారు, ఎవరికి ఏ పతకం వస్తాది అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఎవరైనా రెజ్లర్ 50 నుంచి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా కూడా ఆడటానికి అనుమతి ఇస్తారని.. అయితే రూల్స్ మాత్రం అలా ఉండటంతో వేటు పడిందని వినేశ్ పెదనాన్న మహవీర్ స్పందించారు. ఈ సందర్భంగా దేశప్రజలెవరూ నిరాస చెందొద్దని కోరుతున్నట్లు తెలిపారు. ఆమె ఏదో ఒక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అది పెద్ద సమస్యే కాదు!:

ఇదే సమయంలో.. వినేశ్ పెదనాన్న మహవీర్ స్పందించినట్లుగానే ఒలింపిక్ విజేత విజేంద్ర సింగ్ కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఉన్నట్లు చెబుతు అనర్హత వేటు వేయడం సరైంది కాదని అన్నారు. ఒకవేళ అథ్లెట్ కాస్త అధిక బరువు ఉంటే... రన్నింగ్, స్టీం బాత్ చేసి తగ్గించొచ్చని.. అలా బరువు తగ్గించుకోవడానికి బాక్సర్లకు గంటకుపైగా సమయం ఇస్తారని తెలిపారు.