పీటీ ఉ‘షో’నే.. అండగా నిలవనే లేదు.. వినేశ్ ఫొగాట్ సంచలనం
ఒలింపిక్ పతకం చేజారిన వినేశ్ తీవ్ర కుంగుబాటుకు గురైన సందర్భంలో ఆమెను ఓదార్చేందుకు భారత ప్రభుత్వం దిగ్గజ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు బాధ్యత అప్పగించింది.
By: Tupaki Desk | 11 Sep 2024 7:10 AM GMTక్రీడాకారిణి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలకు దిగారు.. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ 50 కిలోల రెజ్లింగ్ పోటీల్లో కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన వినేశ్.. ఆ సందర్భంగా భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ) వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు వినేశ్ కొంత బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె తీవ్ర కసరత్తులు చేసింది.. ఆఖరికి కడుపులోని ఆహారాన్ని ఖాళీ చేసేందుకు వాంతులు కూడా చేసుకుంది. కానీ, ఓ 100 గ్రాములు మాత్రం తగ్గలేకపోయింది. చివరకు పతకం కోల్పోయింది.
ఆ వేదన నుంచి బయటపడేలా..
ఒలింపిక్ పతకం చేజారిన వినేశ్ తీవ్ర కుంగుబాటుకు గురైన సందర్భంలో ఆమెను ఓదార్చేందుకు భారత ప్రభుత్వం దిగ్గజ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు బాధ్యత అప్పగించింది. దీంతో ఉష.. వినేశ్ వద్దకు వెళ్లి క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అనేలా సముదాయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు తర్వాత బయటకు వచ్చాయి. అయితే, ఇప్పుడు అదంతా తూచ్ అంటున్నారు వినేశ్.
కాస్ తీర్పు వ్యతిరేకం.. వారే కారణం
వినేశ్ తనను ఒలింపిక్ ఫైనల్లో అనర్హురాలిగా ప్రకటించడంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ను ఆశ్రయించగా.. అక్కడా నిరాశే దక్కింది. అయితే, ఐవోసీతో పాటు పీటీ ఉష తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం చేయడంతోనే కాస్ తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పీటీ ఉషను వ్యక్తిగతంగానూ తప్పుబట్టారు. ఆమె తనను పరామర్శించే ఫొటోలను కేవలం సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే వచ్చారని విమర్శించింది. ఉష తన దగ్గరకు వచ్చి ఏమీ చెప్పకుండానే ఫొటోలు దిగారని.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారని వినేశ్ ఆరోపించింది. అంతేకాక మేమంతా నీతోనే ఉన్నాం అని క్యాప్షన్ పెట్టినంత మాత్రాన మద్దతుగా ఉన్నట్లు కాదని పేర్కొంది. ఉష తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని కూడా ఆరోపించించి. ఇదంతా షో కోసమేనని అదో పెద్ద రాజకీయం అని నిందించింది.
సొంతగా కేసు వేశా..
కాస్ లో ఏవైనా కేసు వేయాలంటే దేశం తరఫున లేదా ఆ దేశ ఒలింపిక్ సంఘం తరఫున వేయాలని.. కానీ తాను సొంతంగా కేసు పెట్టానని వినేశ్ చెప్పింది. అంటే తనకు కేంద్ర ప్రభుత్వం, ఒలింపిక్ సంఘం మద్దతు లేదని ఆరోపించింది. తన పతకాన్ని వారు ఎప్పుడో విస్మరించారని.. హరీశ్ సాల్వే లాంటి ప్రముఖ న్యాయవాది వచ్చినా మీడియాతో మాట్లాడేందుకే వారు సమయం తీసుకున్నారని వినేశ్ నిప్పులు చెరిగింది. చివరకు థర్డ్ పార్టీగానే కేసులో వాదనలు వినిపించామని చెప్పింది.
ఐవోఏపై మళ్లీ నిప్పులు..
ఐవోఏ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఉద్యమించిన వినేశ్.. ప్రస్తుత అధ్యక్షుడు సంజయ్ సింగ్ పైనా మండిపడింది. బ్రిజ్ భూషణ్ బదులు డమ్మీ వ్యక్తిని పెట్టారని.. అతడిని నమ్మలేని ఆరోపించింది. బ్రిజ్ భూషణ్ ఇంటినుంచే డబ్ల్యూఎఫ్‌ఐ నడుస్తోందని.. కావాలంటే చూసుకోమని సలహా ఇచ్చింది.