Begin typing your search above and press return to search.

వినేశ్ కు రజత పతకం వచ్చే వీలుందా?

అదే సమయంలో తన అనర్హత వేటు అంశంపై స్పోర్ట్స్ కోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు కోర్టు అంగీకరించింది

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:38 AM GMT
వినేశ్ కు రజత పతకం వచ్చే వీలుందా?
X

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఇష్యూ తెలిసిందే. తాను పోటీ పడిన విభాగానికి ఉండాల్సిన బరువు కంటే కేవలం వంద గ్రాములు అదనంగా బరువు ఉండటంతో ఆమెను టోర్నీ నుంచి అనర్హురాలిగా పేర్కొంటూ వేటు వేయటం తెలిసిందే. పతకం పక్కాగా అనుకున్న వేళ.. పతకం తర్వాత అనర్హత వేటు పడటంపై యావత్ భారతావని షాక్ కు గురైంది. ఇదిలా ఉంటే.. ఈ షాక్ నుంచి కోలుకోలేని వినేశ్.. తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లుగా ప్రకటించారు. అదే సమయంలో తన అనర్హత వేటు అంశంపై స్పోర్ట్స్ కోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు కోర్టు అంగీకరించింది.

మహిళల 50 కేజీల ప్రీస్టయిల్ లో అయితే స్వర్ణం లేదంటే రజత పతకాన్ని పొందే అర్హత ఉన్న వినేశ్.. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉండటం ఆమెకు శాపంగా మారింది. తన అంశంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ను ఆశ్రయించారు వినేశ్. ఈ సంస్థను 1983లో స్థాపించారు. క్రీడలకు సంబంధించిన తలెత్తిన వివాదాల్ని ఈ కోర్టు పరిష్కరిస్తుంది. 1993లో ఈ సంస్థ పూర్తి స్వతంత్రంగా మారింది. పారిస్ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్.. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీల గుర్తింపు పొందిన ఈ సంస్థను అప్పటి ఫ్రెంచ్ న్యాయశాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.

తాజా ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో అతిధ్య దేశమైన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో రెండు తాత్కాలిక ఆఫీసులను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సీఏఎస్ అడ్ హక్ డివిజన్. క్రీడల్లో తలెత్తిన వివాదాల్ని పరిష్కరించే బాధ్యత ఈ సంస్థ తీసుకుంటుంది. ఆటగాళ్లు చేసే ఫిర్యాదుల్ని స్వీకరించి 24 గంటల లోపే తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. 1996 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

కొన్ని ప్రత్యేక సందర్భాలు.. పరిస్థితుల్లో మాత్రం తన తీర్పును కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం సీఏఎస్ అడ్ హక్ డివిజన్ లో అమెరికాకు చెందిన మైఖేల్ లెనార్డ్ అధ్యక్షుడిగా.. ఆస్ట్రియాకు చెందిన డాక్టర్ ఎలిజబెత్ స్టీనర్ ఉపాధ్యక్షుడిగా.. ఫ్రాన్స్ కు చెందిన కరోల్ మలిన్వాద్ మరో ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరి..వినేశ్ ఇష్యూలో వీరి తీర్పు ఏముంటుందన్నది ఇప్పుడు ఉత్కంటను రేపుతోంది. ఒకవేళ.. తీర్పు సానుకూలంగా వస్తే.. రజత పతకం దక్కే వీలుంది. అయితే.. ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.