300.. మరొక్క అడుగే.. కోహ్లి ముందు అరుదైన రికార్డు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాని చేరాడు.
By: Tupaki Desk | 24 Feb 2025 8:10 AM GMTచాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ ఇండియా ఆటగాళ్లకు అరుదైన మైలురాళ్ల వేదికగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 11 వేల పరుగుల రికార్డును అందుకోగా.. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ 200 వికెట్ల వీరుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం 200 వన్డేలు ఆడిన ఘనతను అందుకున్నాడు. వన్డేలు పూర్తిగా తగ్గిపోతూ.. మరికొన్నేళ్ల తర్వాత అసలు నిర్వహణ ఉంటుందా? అనే ఈ రోజుల్లో ఏ విధంగా చూసినా ఇవి గొప్ప రికార్డులే.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాని చేరాడు. ఇప్పటివరకు వన్డేల్లో కేవలం ముగ్గురే 14 వేల పరుగులు దాటారు. ఇందులో ఇద్దరు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18426), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (14,234). కోహ్లి 299వ వన్డేలో 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లోనే విరాట్ ఈ రికార్డును అందుకుంటాడని అనుకున్నా.. 15 దూరంగా ఔటయ్యాడు.
300 ముంగిట..
కోహ్లి ఇప్పటివరకు 299 వన్డేలు ఆడాడు. చాంపియన్స్ ట్రోఫీలో వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే లీగ్ మ్యాచ్ అతడికి 300వది కానుంది. పాకిస్థాన్ తో మ్యాచే 300వ మ్యాచ్ కావాల్సింది. అయితే, ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడలేదు. ఇక న్యూజిలాండ్ తో 300వ మ్యాచ్ ఆడనున్న కోహ్లి.. ఈ ఘనత అందుకున్న 7వ ఇండియన్ క్రికెటర్ కానున్నాడు.
సచిన్ (463), ధోనీ (347), ద్రవిడ్ (340), అజహర్ (334), గంగూలీ (308), యువరాజ్ (301) మాత్రమే 300కు పైగా వన్డేలు ఆడారు. ఇక కోహ్లి మరో ఏడాదిన్నర అయినా వన్డేలు ఆడే చాన్సుంది. ఈ క్రమంలో గంగూలీని దాటి ఐదో స్థానంతో ముగిస్తాడేమో..? అజహర్ ను చేరాలంటే ఇంకో 34 వన్డేలు ఆడాలి. ఇది కాస్త కష్టమే.
కొసమెరుపు: 2008లో కోహ్లి అంతర్జాతీయ కెరీర్ శ్రీలంకపై వన్డేతోనే మొదలైంది. చివరకు టెస్టుతో ముగిసేలా కనిపిస్తోంది