గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడాలా? బీసీసీఐపై కోహ్లీ సీరియస్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
By: Tupaki Desk | 17 March 2025 12:17 AM ISTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదీర్ఘ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ప్రయాణాలపై బీసీసీఐ విధించిన పరిమితులపై కోహ్లీ తన గళం విప్పాడు. కొత్తగా తీసుకొచ్చిన కుటుంబ పరిమితి నిబంధనలు అర్థం లేనివని, వీటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఆయన బోర్డును ప్రశ్నించాడు.
బీసీసీఐ ప్రకారం, 45 రోజుల కంటే ఎక్కువ నిడివి ఉన్న విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలు కేవలం మొదటి రెండు వారాలు మాత్రమే వారితో ఉండగలవు. ఆ తర్వాత వారికి కేవలం 14 రోజుల అనుమతి మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు వారి కుటుంబ సభ్యుల అండ ఎంతో ముఖ్యమని, ఇది వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన అన్నాడు.
"ఒక క్రికెటర్ గా, మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత నా కుటుంబంతో గడిపే సమయం నాకు ఎంతో విలువైనది. అది నన్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. కానీ బీసీసీఐ తీసుకున్న ఈ కొత్త నిబంధనల వల్ల మేము ఎక్కువ సమయం ఒంటరిగా గడపాల్సి వస్తుంది," అని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులను కలిసే అవకాశం తగ్గిపోవడం వల్ల ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌పై సెంచరీతో పాటు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో అతని భార్య అనుష్క శర్మ స్టేడియంలో ఉండి అతనికి మద్దతు తెలిపింది. వారిద్దరూ కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, కుమార్తె సమైరా కూడా జట్టును ప్రోత్సహిస్తూ కనిపించారు.
కుటుంబ సభ్యుల మద్దతు తన ఆటతీరును మెరుగుపరుస్తుందని కోహ్లీ స్పష్టం చేశాడు. "ఒంటరిగా కూర్చొని బాధపడటం నాకు ఇష్టం లేదు. ఒక ఆటగాడిగా నా బాధ్యత పూర్తయిన తర్వాత నేను సాధారణ జీవితం గడపాలనుకుంటున్నాను," అని ఆయన అన్నాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ భవిష్యత్తులో ఈ నిబంధనను పునఃపరిశీలిస్తుందో లేదో చూడాల్సి ఉంది.