Begin typing your search above and press return to search.

కింగ్ కోహ్లి.. ఏడాదిన్నర తర్వాత.. 81వ సెంచరీ.

కానీ, అతడు ఫీనిక్స్. పడిన ప్రతిసారీ అంతకంటే పైకి లేవడం తన నైజం. అతడు పోరాట యోధుడు.. పనికిరాడని తిట్టిన ప్రతిసారీ పరుగులు పారిస్తుంటాడు. ఇప్పుడూ పెర్త్ గడ్డపై ఇదే పని చేశాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2024 11:38 AM GMT
కింగ్ కోహ్లి.. ఏడాదిన్నర తర్వాత.. 81వ సెంచరీ.
X

టి20ల్లో పనైపోయిందన్నారు.. వన్డేల్లోనూ జోరు తగ్గిందన్నారు.. టెస్టుల్లో విఫలం అవుతుండడంతో ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.. మొన్నటి న్యూజిలాండ్ సిరీస్ లో సొంతగడ్డపై పరుగులు చేయకపోవడంతో ఇదే ఆఖరి సిరీస్ అని కూడా హెచ్చరికలు మోగాయి.. కానీ, అతడు ఫీనిక్స్. పడిన ప్రతిసారీ అంతకంటే పైకి లేవడం తన నైజం. అతడు పోరాట యోధుడు.. పనికిరాడని తిట్టిన ప్రతిసారీ పరుగులు పారిస్తుంటాడు. ఇప్పుడూ పెర్త్ గడ్డపై ఇదే పని చేశాడు.

అటు కుర్రాడు.. ఇటు యోధుడు

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తానేంటో మరోసారి నిరూపించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కాస్త టచ్ లోనే కనిపించిన అతడు అనూహ్య బౌన్స్ కు ఔటయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్మురేపాడు. తనకు గతంలో అచ్చొచ్చిన పెర్త్ లో మరోసారి మెరిశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కుర్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (161) అదరగొట్టగా.. సీనియర్ విరాట్ కోహ్లి (100 నాటౌట్) అజేయ సెంచరీతో అద్భుతమైన ముగింపునిచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ ను 487/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 534 పరుగుల అసాధ్యమైన టార్గెట్ ను నిర్దేశించింది.

కోహ్లి సత్తా..

వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (25) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి.. మొదటి నుంచి సాధికారికంగా ఆడాడు. తనదైన శైలిలో షాట్లు కొట్టాడు. 143 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 2 సిక్స్ లు, 8 ఫోర్లతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్స్ లు) సాయంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

టెస్టుల్లో 30.. మొత్తమ్మీద 81

కోహ్లి కెరీర్ లో ఇది 30వ టెస్టు సెంచరీ. మొత్తమ్మీద అన్ని ఫార్మాట్లలో కలిపి 81. వన్డేల్లో 50 సెంచరీలతో కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తున ఉన్నాడు. భారత గ్రేట్ సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు)ను అధిగమించాడు. ఇక టి20ల్లో ఏకైక సెంచరీని మూడేళ్ల కిందట అఫ్ఘానిస్థాన్ పై చేశాడు. దీంతో మొత్తం 81 సెంచరీలతో సచిన్ (100 సెంచరీలు)కు మరింత దగ్గరయ్యాడు. కానీ, ఇంకా 19 సెంచరీల దూరంలో ఉన్నాడు. సచిన్ ను అందుకోవడం మాత్రం కష్టమే. చూద్దాం.. కోహ్లి ప్రయాణం ఎక్కడివరకు సాగుతుందో?