గ్లెన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్ .. ‘ఫిలిప్స్ బల్బ్’ను తగులుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్
విరాట్ కోహ్లీ మైదానంలో అడుగు పెట్టినప్పుడు, కోట్లాది మంది అభిమానులు అతని ప్రతిభను ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తారు.
By: Tupaki Desk | 3 March 2025 4:22 PM ISTమన దేశంలో క్రికెట్ కేవలం ఒక క్రీడ కాదు. ఇది ఒక భావోద్వేగం. విరాట్ కోహ్లీ మైదానంలో అడుగు పెట్టినప్పుడు, కోట్లాది మంది అభిమానులు అతని ప్రతిభను ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఢిల్లీలో రంజీ మ్యాచ్ కోహ్లీ అడితే ఏకంగా స్టేడియం నిండిపోయేలా ఫ్యాన్స్ వచ్చారు. తొక్కిసలాట కూడా జరిగింది. అంతటి క్రేజ్ కోహ్లీ సొంతం. అయితే నిన్న చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి అనుకున్నట్లు అదృష్టం కలిసిరాలేదు. అతను కేవలం 11 పరుగులకే అవుట్ కాగా, అతని వికెట్ పడిపోయిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ పాయింట్ ఫీల్డింగ్ లో అద్భుత డైవ్ చేసి టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ క్యాచ్‌గా చెప్పదగిన ఓ అద్భుతాన్ని అందించాడు. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కోహ్లీ అతని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. క్రికెట్ అభిమానులు ఫిలిప్స్ ప్రతిభను ప్రశంసించినప్పటికీ కోహ్లీ అభిమానులలో కొంతమంది విభిన్నంగా స్పందించారు.
కొంతమంది కోహ్లీ అభిమానులు తమ ఆగ్రహాన్ని 'Philips' అనే ఎలక్ట్రికల్ అప్లయన్స్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌పై చూపించారు. గ్లెన్ ఫిలిప్స్ పేరుతో ఉన్న Philips బ్రాండ్‌పై మండిపడ్డారు. సరదాగా ఇలా చేసారా అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Philips ఇండియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లీ అభిమానుల నుంచి ట్రోలింగ్ పోస్టులు, ఆగ్రహంతో కూడిన వ్యాఖ్యలు, సరదా మీమ్స్ భారీగా వెల్లువెత్తాయి. కొంతమంది అభిమానులు నిజంగానే అయోమయంలో ఉన్నట్లు అనిపించగా.. మరికొందరు సరదాగా ఈ సంఘటనను మరింత పాపులార్ చేశారు.
సోషల్ మీడియాలో కోహ్లీ ఔట్ ను ముడిపెట్టి స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ ‘ఫిలిప్స్ ’ బల్బ్ కంపెనీపై సరదాగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.. ఈ ఘటన ఇండియన్ క్రికెట్ అభిమానుల భావోద్వేగాలను మళ్లీ రుజువు చేసింది.
ఈ అనూహ్యమైన ట్రోలింగ్‌పై Philips కంపెనీ స్పందించలేదు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ మాత్రం తన అద్భుత ఆటతీరు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఈ సరదా ఘటన భారత క్రికెట్ చరిత్రలో అపూర్వమైన ఫ్యాన్ రియాక్షన్‌లలో ఒకటిగా చేరింది. ఇది అసంతృప్తి కావచ్చు, అభిమాన భావోద్వేగం కావచ్చు.. లేక కేవలం వినోదం కావచ్చు. భారతదేశంలో క్రికెట్ మోజు అమితమైనదనే విషయాన్ని ఇది మళ్లీ రుజువు చేసింది!