విరాట్ కోహ్లి ఖేల్ ఖతం.. ఇదిగో ఈ స్కోర్లే నిదర్శనం..
టి20లను అసలు క్రికెటర్ ప్రతిభకు కొలమానంగా భావించరు. వన్డేల్లో ఎలాగూ కోహ్లి తిరుగులేని ఆటగాడు.
By: Tupaki Desk | 25 Sep 2024 3:30 PM GMT0, 24, 37, 0, 9, 76, 24, 14, 20, 6-17… ఇవీ ఇటీవలి కాలంలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి స్కోర్లు.. ఇందులో ఒక డకౌట్ అమెరికా లాంటి అనామక జట్టు మీద అయితే.. మరో డకౌట్ ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టు మీద.. ఈ ఇన్నింగ్స్ లో టి20, వన్డే, టెస్టులు.. మూడు ఫార్మాట్ల పరుగులూ ఉన్నాయి. మొత్తం పది ఇన్నింగ్స్ లలో ఒక్కటంటే ఒక్కటే హాఫ్ సెంచరీ. గత వారం ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఎల్బీడబ్ల్యూపై రివ్యూనే చేయలేదు. బంతి బ్యాట్ కు తగిలి ప్యాడ్ కు తగిలిందని తర్వాత తేలింది. దీన్నిబట్టే కోహ్లికి ఏమైంది? అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. టి20 ప్రపంచ కప్ లో విఫలైమన అతడు ఫైనల్లో మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు బలవంతంగా ఆడిస్తే స్పిన్ బౌలింగ్ లో తేలిపోయాడు. దీంతోనే విరాట్ కోహ్లి పనైపోయింది అనే విమర్శలు వస్తున్నాయి.
నాలుగేళ్లలో రెండే సెంచరీలు
టి20లను అసలు క్రికెటర్ ప్రతిభకు కొలమానంగా భావించరు. వన్డేల్లో ఎలాగూ కోహ్లి తిరుగులేని ఆటగాడు. 50 సెంచరీలతో 13,900 పరుగులు చేశాడు. టెస్టుల్లోనే కోహ్లి తేలిపోతున్నాడు. అతడు అత్యంత ఇష్టపడే ఈ సంప్రదాయ ఫార్మాట్ లో ఫామ్ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఒకప్పుడు టెస్టుల్లోనూ క్రికెట్ దిగ్గజం సచిన్ తో పోటీ పడ్డాడు. అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డులను కోహ్లి కొట్టేస్తాడా? అనే అభిప్రాయం వినిపించింది. అయితే, అదే టెస్టుల్లో ఇటీవలి కాలంలో విరాట్ చాలా వెనకబడిపోయాడు. గత నాలుగేళ్లలో అతడు టెస్టుల్లో చేసినవి రెండే సెంచరీలు. 2020 ముందు వరకు కోహ్లి వేరు.. ఇప్పటి కోహ్లి వేరు.. అన్నట్లుంది పరిస్థితి. దీంతో సచిన్ టెస్టు సెంచరీల (51) రికార్డుకు కోహ్లి (29) చాలా దూరంలో ఉండిపోయాడు.
బంగ్లాతో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 23 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, వచ్చే నాలుగు నెలల్లో టీమ్ ఇండియా ఇంకో 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో 5 ఆస్ట్రేలియా గడ్డపైనే కావడం గమనార్హం. బంగ్లాతో ఒకటి, న్యూజిలాండ్ తో మూడు టెస్టులు స్వదేశంలో జరగనున్నాయి. వీటిలో కోహ్లి ఫామ్ లోకి రావడం అత్యంత అవసరం. కాగా, 114 టెస్టుల్లో కోహ్లి 8,871 పరుగులు చేశాడు. ఈ లెక్కన అతడు సచిన్ రికార్డులను అధిగమించడం అసాధ్యం అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్. కోహ్లి తన జోరును ఎప్పుడో కోల్పోయాడని స్పష్టం చేశాడు. అతడిలో మునుపటి దూకుడు తగ్గిందని.. సచిన్ రికార్డుల దగ్గరకూ వెళ్లలేడని చెబుతున్నాడు.
సచిన్ ను దాటేసేది అతడే
200 టెస్టుల్లో సచిన్ 15,921 పరుగులు చేశాడు. దీనిని అందుకోవడం ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ రూట్ కే సాధ్యం అని చెప్పొచ్చు. రూట్ 146 టెస్టుల్లో 12,402 పరుగులు సాధించాడు. ఇంకో 3,500 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో సిరీస్ లో 300 పైగా పరుగులు చేశాడు. దీంతో సచిన్ సెంచరీల రికార్డును కాకపోయినా.. అత్యధిక పరుగుల రికార్డునైనా రూట్ కొల్లగొట్టే చాన్సుందని అంచనా. టి20లకు పరిగణనలోకి తీసుకోని రూట్ వన్డేలు కూడా పెద్దగా ఆడడం లేదు. కాబట్టి సచిన్ ను అధిగమించే సత్తా రూట్ కే ఉందని హాగ్ అంటున్నాడు.