2006 డిసెంబరు.. ఒక రంజీ మ్యాచ్.. కోహ్లి ఏం చేశాడో తెలుసా?
ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడడం పెద్ద విశేషం అయింది.. కానీ, సరిగ్గా 18 ఏళ్ల కిందట ఏం జరిగిందో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.
By: Tupaki Desk | 30 Jan 2025 2:30 PM GMTఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడడం పెద్ద విశేషం అయింది.. కానీ, సరిగ్గా 18 ఏళ్ల కిందట ఏం జరిగిందో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. చాలామందికి గుర్తుందో లేదో కానీ.. 2006 డిసెంబరు 16-20 మధ్యన కోహ్లి 18 ఏళ్ల కుర్రాడిగా ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ తొలి సీజన్ లో అడుగుపెట్టాడు. అప్పటికి ఢిల్లీ జట్టులో సీనియర్లు ఆకాశ్ చోప్రా, శిఖర్ ధావన్, ఆశిష్ నెహ్రాతో పాటు ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి కుర్రాళ్లున్నారు.
ఢిల్లీలో 2006లో డిసెంబరు 17న మొదలైంది కర్ణాటక-ఢిల్లీ రంజీ మ్యాచ్. గ్రూప్ –ఎలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 446 పరగుల భారీ స్కోరు చేసింది. అప్పటికే టీమ్ ఇండియాలోకి వచ్చేసిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప 161 పరుగుల భారీ సెంచరీ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఢిల్లీ 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఫాలోఆన్ దాటాలంటే 247 పరుగులు చేయాలి. అలాంటి సమయంలో బ్యాటింగ్ కు దిగాడు 18 ఏళ్ల విరాట్ కోహ్లి. కానీ, అతడికో దుర్వార్త తెలిసింది.
జట్టును కాపాడాల్సిన స్థితిలో కోహ్లి మంచి స్ట్రయిక్ తో బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లికి తన తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. సొంత ఊరు ఢిల్లీలోనే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతడు జట్టు పరిస్థితి చూసి బ్యాటింగ్ కొనసాగిచేందుకే నిర్ణయించుకున్నాడు. అలా 90 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ చేజారినప్పటికీ కోహ్లి ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అతడి నిబద్ధత వార్తల్లోకి ఎక్కింది. ఇది జరిగిన నాలుగు నెలలకే కోహ్లి సారథ్యంలో టీమ్ ఇండియా అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. మరో 8 నెలల్లో కోహ్లి టీమ్ ఇండియాలోకీ వచ్చేశాడు. ఈ తర్వాత దిగ్గజంగా ఎదిగాడు.
కొసమెరుపు: 2006లో మ్యాచ్ జరిగింది ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో. నాడు తండ్రి చనిపోయిన కోహ్లిని ఓదార్చేందుకు స్టేడియానికి వచ్చారు అప్పటి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ. తర్వాత ఇదే స్టేడియానికి అరుణ్ జైట్లీ చనిపోయాక ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు కోహ్లి అదే మైదానంలో మ్యాచ్ ఆడుతున్నాడు.