ఐపీఎల్ 2025: స్పిన్నర్ల పీచమణిచే కోహ్లీ కొత్త షాట్.. వైరల్ వీడియో
బెంగళూరు ఓపెనర్లు సాల్ట్ , విరాట్ కోహ్లీ మెరుపులతో కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోశారు.
By: Tupaki Desk | 23 March 2025 12:10 PM ISTఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) శుభారంభం చేసింది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బెంగళూరు ఓపెనర్లు సాల్ట్ , విరాట్ కోహ్లీ మెరుపులతో కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ కలిసి దూకుడుగా ఆడటంతో 175 పరుగుల లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. సాల్ట్ -కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌కు కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా బెంగళూరు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించారంటే కోహ్లీ, సాల్ట్ ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు.
విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈడెన్ గార్డెన్స్‌ను హోరెత్తించాడు. కేవలం 36 బంతుల్లో 4 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో అజేయంగా 59* పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 4 స్లాగ్ స్వీప్ షాట్లు ఆడటం విశేషం. సాధారణంగా పేస్ బౌలర్లపైనే ఇలాంటి షాట్లు ఆడతారు. కానీ కోహ్లీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్‌లపై వాటిని ఉపయోగించి ఎక్కువ పరుగులు రాబట్టాడు. ఈ షాట్లే అతని ప్రధాన అస్త్రంగా మారాయి.
టీమిండియా మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్ , అభినవ్ ముకుంద్ విరాట్ కోహ్లీ ఆడిన ఈ అద్భుతమైన షాట్లను ప్రశంసించారు. "కోల్‌కతా జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలం. కానీ విరాట్ కోహ్లీ ఆ బలాన్ని తుత్తునియలు చేశాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ స్పిన్ బౌలింగ్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా ఆడాడు. స్లాగ్ స్వీప్ షాట్లతో అదరగొట్టాడు. విరాట్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని రహానే కూడా ఊహించి ఉండడు. నాలుగో ఓవర్‌లోనే వరుణ్‌ను దింపినా ఫలితం లేకపోయింది. కోహ్లీ ఆడిన తీరు గొప్ప స్పిన్ బౌలర్లకు కూడా సవాలు విసిరేలా ఉంది" అని వారు వ్యాఖ్యానించారు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఒక కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగు వేర్వేరు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా కోహ్లీ 1000కి పైగా పరుగులు సాధించాడు. బెంగళూరు తన తర్వాతి మ్యాచ్‌లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.