Begin typing your search above and press return to search.

కోహ్లికేమైంది...? అతడికీ గాయమేనా..? ఏమిటా పోస్ట్ అర్థం?

అయితే, ఇలాంటి సమయంలో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయం అవుతోంది.

By:  Tupaki Desk   |   20 Nov 2024 12:10 PM GMT
కోహ్లికేమైంది...? అతడికీ గాయమేనా..? ఏమిటా పోస్ట్ అర్థం?
X

ఇప్పటికే ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అత్యంత కీలకమైన వన్ డౌన్ లో యువ బ్యాట్స్ మన్ శుభ్ మన్ గిల్ వేలికి గాయమైంది. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా వస్తాడని భావించిన కేఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో దెబ్బ తగిలించుకున్నాడు.. ఇక రెండు రోజుల్లో ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పైగా ఇది ఐదు టెస్టుల సిరీస్. 34 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్ ఇదే తొలిసారి. అయితే, ఇలాంటి సమయంలో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయం అవుతోంది.

అభిమానులు హతాశులు..

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)కి శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో రోహిత్ ఆడడం లేదు. గిల్ కు గాయమైంది. పేస్ బౌలర్ బుమ్రా కెప్టెన్ గా చేయనున్నాడు. ఇలాంటి సమయంలో కోహ్లి పాత్ర కీలకం. అయితే, అతడు బుధవారం పెట్టిన ఓ పోస్ట్.. అభిమానుల గుండెలను కాసేపే ఆపేసినంత పనయింది.

వెనక్కుతిరిగి చూసుకుంటే..

పురుషుల ఉత్పత్తులకు సంబంధించి బ్రాండ్‌ ‘రాన్‌ (Wrogn)’ను కోహ్లి స్థాపించిన సంగతి తెలిసిందే. దీనికి పదేళ్లు పూర్తయింది. అప్పటికి కోహ్లి ఇంకా కెప్టెన్ కూడా కాలేదు. దిగ్గజంగా ఎదిగే స్థితిలో ఉన్నాడు. కాగా, ‘‘వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాం. ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండు సార్లు మిస్‌ ఫిట్‌ అయ్యాం. మా ప్రయాణంలో కాలానికి అనుగుణంగా ఎంతో మారాం. మా ప్రత్యేకత మాత్రం అలాగే ఉంది. కొందరు మమ్మల్ని క్రేజీ అనుకున్నారు. కొంతమందికి మేం అర్థమే కాలేదు. మేం అవేమీ పట్టించుకోలేదు. నిరూపించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాం’’ అంటూ ట్వీట్ చేశాడు.

ఎన్నో ఎత్తుపల్లాలు

గత పదేళ్లలో కోహ్లి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. 2014 చివర్లో టెస్టు కెప్టెన్ అయిన అతడు 2022 మొదట్లో పగ్గాలను వదిలేశాడు. అయితే , రాన్ ప్రయాణమూ అంతే సాగిందన్నాడు. కరోనా మహమ్మారి కూడా మమ్మల్ని వణికించలేదన్నాడు. ఇతరుల కంటే భిన్నంగా ఉండటమే తమను ప్రత్యేకంగా మార్చిందని చెప్పుకొచ్చాడు. అదే తమ బలంగా పేర్కొన్నాడు. మరో పదేళ్లు ఇలాగే కొనసాగుతామని.. రాన్‌: ఓ సరైన వ్యక్తి కోసం’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

అయితే, ట్వీట్ కోసం వాడిన తెల్లటి బ్యాక్ గ్రౌండ్ టెంప్లేట్.. మొదటి వరుసలోని పదాలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. వాస్తవానికి వ్యక్తిగత, కెరీర్‌ అప్‌ డేట్‌ లను పంచుకునేందుకు కోహ్లీ ఈ టెంప్లేట్‌ వాడతాడు. 2022లో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి దిగిపోతున్నట్లు ఇలానే ప్రకటించాడు. అయితే, ఇటీవల న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ లో ఘోరంగా విఫలం కావడంతో కోహ్లికి ఆస్ట్రేలియా సిరీస్ చివరిదని భావిస్తున్నారు. ఇక్కడ నిరూపించుకోకుంటే వేటు తప్పదని అంటున్నారు. అందుకనే కోహ్లి ట్వీట్ వైరల్ గా మారింది.