Begin typing your search above and press return to search.

సచిన్ రికార్డుల బ్రేక్ కు కోహ్లికి రెస్ట్.. ఆసీస్ దిగ్గజం.. నిజమేనా?

100.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ టెస్టు, వన్డే ఫార్మాట్లలో కలిపి చేసిన సెంచరీల సంఖ్య . వాస్తవానికి సచిన్ వయసులో ఉన్నప్పటికి టి20 ఫార్మాట్ ఊపులోకి రాలేదు

By:  Tupaki Desk   |   21 Sep 2023 7:43 AM GMT
సచిన్ రికార్డుల బ్రేక్ కు కోహ్లికి రెస్ట్.. ఆసీస్ దిగ్గజం.. నిజమేనా?
X

100.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ టెస్టు, వన్డే ఫార్మాట్లలో కలిపి చేసిన సెంచరీల సంఖ్య . వాస్తవానికి సచిన్ వయసులో ఉన్నప్పటికి టి20 ఫార్మాట్ ఊపులోకి రాలేదు. అంతర్జాతీయంగా అతడు ఒకే ఒక టి20 ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడినప్పటికీ అది లెక్కలోకి రాదు. అసలు సచిన్ కు అంతర్జాతీయంగా టి20లు ఆడే ఉద్దేశం లేదు. ఈ నిర్ణయం 2007 టి20 తొలి ప్రపంచ కప్ సందర్భంగానే తీసుకున్నాడు. అప్పటికి అతడి వయసు 34. కుర్రాళ్ల గేమ్ అయిన టి20లో సీనియర్ అయిన తాను పోటీపడడం ఎందుకని సచిన్ నాటి ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్నాడు. ఇదే నిర్ణయాన్ని మరో ఇద్దరు దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అనుసరించక తప్పలేదు.

ఆ నిర్ణయం ఎంతో మేలు..

వాస్తవానికి సచిన్ అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకోవాలని 2007లో తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్ కు అత్యంత మేలు చేసిందనే చెప్పాలి. నాడు అతడు తప్పుకోవడం.. గంగూలీ, ద్రవిడ్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం చాలామంది కుర్రాళ్లకు చాన్సులు దక్కాయి. అంతేగాక ధోనీ వంటి అద్భుత కెప్టెన్ దొరికాడు. ఇక అసలు విషయానికి వస్తే సచిన్ 100 సెంచరీల్లో వన్డేల్లో చేసినవి 49. టెస్టుల్లో 51 సెంచరీలు బాదాడు. క్రికెట్ కు ప్రామాణికమైన టెస్టుల్లో సచిన్ సెంచరీల హాఫ్ సెంచరీ కొట్టాడు. తన తరంనాటి ఆకర్షణీయ క్రికెట్ అయిన వన్డేల్లో సెంచరీల హాఫ్ సెంచరీకి ఒక్క హాఫ్ సెంచరీ ముంగిట ఆగిపోయాడు.

అదే వరుసలో విరాట్..

భారత క్రికెట్ లో సచిన్ తర్వాత స్థానం విరాట్ కోహ్లిదే. ఈ మాట ఎందుకు చెప్పాలంటే.. ధోనీ కూడా వీరి సరసన నిలిచే క్రికెటర్ అయినప్పటికీ, అతడిది కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ కూడా కలిపి చూడాలి. కాగా, కోహ్లి ప్రస్తతం 34 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఈ నవంబరుతో 35 నిండుతాయి. కోహ్లి ఇప్పటివరకు టెస్టుల్లో 29, వన్డేల్లో 47, టి20ల్లో ఒక సెంచరీ కొట్టాడు. మొత్తం 77 సెంచరీలతో ఉన్నాడు. ఫామ్ ,ఫిటెనెస్ పరంగా చూస్తే కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా ఉన్నవాడు. అంటే, సచిన్ సెంచరీల రికార్డును చేరుకోగల అవకాశం కోహ్లికే ఉందనడంలో సందేహం లేదు.

కోహ్లి కొట్టేస్తాడా సెంచరీల సెంచరీ?

కోహ్లి వంద సెంచరీల రికార్డును సచిన్ అందుకోవాలంటే మరో 23 సెంచరీలు కొట్టాలి. వాస్తవానికి మూడేళ్లుగా కోహ్లి కాస్త వెనుకబడ్డాడు. లేదంటే ఇప్పటికే 85 సెంచరీల వరకు వచ్చేవాడు. 2019 నవంబరు నుంచి దాదాపు రెండేళ్లు సెంచరీనే లేదు. అయితే, ఏడాది వ్యధిలో టెస్టులు, వన్డేలు, టి20 (ఏకైక)ల్లో ఐదు పైనే శతకాలు బాదాడు. ఈ ఊపు చూస్తుంటే సచిన్ వంద సెంచరీల సెంచరీని అందుకునే అవకాశం ఉంది.

టి20ల్లో ఆడడం లేదు కాబట్టి..

గత ప్రపంచ కప్ నుంచి కోహ్లిని టి20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఫార్మాట్ లో అతడిని ఇక పరిగణించనట్లే. ఈ నేపథ్యంలోనే కోహ్లికి మరింత విశ్రాంతితో పాటు టెస్టులు, వన్డేలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా శత శతకాలు కొట్టే వీలుంది. అయితే, వీటి మధ్యలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చాడు. సచిన్ సెంచరీల రికార్డును చేరుకునేందుకే కోహ్లికి తరచూ విశ్రాంతి ఇస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి జరిగే వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచ్ లకు కోహ్లికి విశ్రాంతి ఇచ్చిన సందర్భాన్ని పట్టుకుని గిల్ క్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ పూర్తిగా మాత్రం అలా అనుకోవడానికి లేదు.

విశ్రాంతి అవసరమే..

ఐపీఎల్, వన్డేలు, టెస్టులు అంటూ నిర్విరామంగా ఆడుతున్నాడు కోహ్లి. ఆరు నెలల నుంచే అంతర్జాతీయ టి20లు ఆడడం లేదు. దీన్నిబట్టి చూస్తే కోహ్లికి విశ్రాంతి అవసరమే. అందులోనూ వచ్చే నెల నుంచి అత్యంత కీలకమైన ప్రపంచ కప్ జరగనుంది. ఆపై కీలక సిరీస్ లు ఉన్నాయి. టెస్టు చాంపియన్ షిప్ కొత్త సైకిల్ లోనూ కోహ్లి పాత్ర కీలకం. ఈ నేపథ్యంలోనే అతడికి ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇచ్చారు. మూడో మ్యాచ్ లో కోహ్లి ఆడనున్నాడు.