Begin typing your search above and press return to search.

‘ఓపెనర్ కోహ్లి’ ఫెయిల్.. అంతర్జాతీయ స్థాయిలో కష్టమే..

బహుశా తొలిసారిగా టి20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లి ఓపెనింగ్ కు దిగుతున్నాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 1:30 PM GMT
‘ఓపెనర్ కోహ్లి’ ఫెయిల్.. అంతర్జాతీయ స్థాయిలో కష్టమే..
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అంటే ఓకే.. అక్కడ ఒకరిద్దరే నాణ్యమైన బౌలర్లు ఉంటారు.. అందులోనూ అది జరిగేది భారత గడ్డపై.. కాబట్టి విరాట్ కోహ్లి వంటి మేటి బ్యాటర్ ఓపెనర్ గా దిగి టన్నుల కొద్దీ పరుగులు సాధించేస్తుంటాడు. కానీ, అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఓపెనర్ గా కోహ్లి రాణించగలడా? అంటే దీనికి సమాధానం కష్టమే.

రెండు మ్యాచ్ ల్లోనూ విఫలం

బహుశా తొలిసారిగా టి20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లి ఓపెనింగ్ కు దిగుతున్నాడు. వాస్తవానికి వన్డేలు, టి20ల్లో అతడు వన్ డౌన్ బ్యాటర్. జట్టులో అత్యుత్తమ బ్యాటర్ దిగే స్థానం అది. ఇక టెస్టుల్లో కోహ్లి దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తరహాలో నాలుగో స్థానంలో వస్తాడు. అయితే, ఇక్కడ ఎప్పుడూ అతడు ఓపెనర్ గా దిగని సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాగా, ఐపీఎల్ కథ వేరు. అంతర్జాతీయ స్థాయిలో జట్టు అవసరాల రీత్యా ఓపెనర్ గా వస్తున్న కోహ్లి రాణించలేకపోతున్నాడు. ఈ నెల 5న ఐర్లాండ్ తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఆదివారం పాకిస్థాన్ తో కీలక మ్యాచ్ లో ఫోర్ కొట్టి వెంటనే వికెట్ ఇచ్చేశాడు. దీంతోనే ఓపెనర్ గా కోహ్లి రాణించగలడా? అనే అనుమానం వస్తోంది.

వన్ డౌన్ కు పంపడమే మేలా?

అమెరికా పిచ్ లు బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతోనే కోహ్లి విఫలం అవుతున్నాడనే చెప్పడం సరికాదు. అయితే, అతడికి ఓపెనింగ్ సూట్ కాదని స్పష్టం అవుతోంది. స్పెషలిస్ట్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఉండగా.. కోహ్లిని ఓపెనింగ్ పంపుతూ, ఆల్ రౌండర్ శివమ్ దూబెను ఆడిస్తున్నారు. దూబె కూడా రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. దీనికంటే యశస్విని ఆడించి కోహ్లిని వన్ డౌన్ పంపడమే మేలు. అప్పుడు పంత్ నాలుగో స్థానంలో వస్తాడు.

పంత్ నే ఓపెనింగ్ కు పంపితే?

కోహ్లి బదులు పంత్ నే ఓపెనింగ్ కు పంపితే ఎలా ఉంటుందో జట్టు మేనేజ్ మెంట్ ఆలోచించాలి. అప్పుడు ఆల్ రౌండర్ దూబెను కొనసాగించవచ్చు. కోహ్లి తనకు ఇష్టమైన వన్ డౌన్ లో వచ్చేందుకు వీలుంటుంది. కాకపోతే.. పాక్ తో మ్యాచ్ లో ఇప్పటికే అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకుపంపారు. ఇలాంటి ప్రయోగాలు ఎక్కువ చేసి, ఫలితం రాకుంటే విమర్శలు పెరుగుతాయి. అంతేగాక.. కోహ్లి వంటి బ్యాటర్ పరుగులు చేయడానికి ఒక్క ఓవర్ చాలు.. ఆ తర్వాత అతడిని ఆపే వారే ఉండరు. కాకపోతే కోహ్లి రాణించేవరకు చూడాలి. అమెరికా, కెనడాతో మ్యాచ్ లలో అతడు చెలరేగుతాడామో చూద్దాం..