కోహ్లి.. కోల్ కతాలో కొట్టర కొట్టు.. పుట్టిన రోజున దంచికొట్టు
By: Tupaki Desk | 5 Nov 2023 7:45 AM GMT15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్.. 78 సెంచరీలు.. మూడు ఫార్మాట్లలోనూ మేటి బ్యాట్స్ మన్.. కెప్టెన్ గా చక్కటి విజయాలు.. అత్యద్భుత ఫిట్ నెస్ తో భావి తరాల క్రికెటర్లకు స్ఫూర్తి.. మ్యాచ్ గెలవాలన్న కసి.. ఛేదనలో రారాజు.. బహుశా వర్తమాన క్రికెటర్ లో ఇన్ని విశేషణాలు ఏ క్రికెటర్ కూ ఉండవేమో.? ఓ 15 ఏళ్ల క్రితం అతడు వర్ధమాన క్రికెటర్.. పదేళ్ల కిందట ప్రతిభ ఉన్న బ్యాట్స్ మన్.. మరి ఇప్పుడు దిగ్గజ బ్యాట్స్ మన్.. ఆల్ టైమ్ గ్రేట్ కు అతి చేరువలో..?
ఈ తరానికి ఇతడు..
భారత క్రికెట్ చేసుకున్న లక్ ఏమిటో కానీ.. తరానికి ఒక అత్యద్భుత మేటి బ్యాట్స్ మన్ పుడుతుంటారు. భీకరమైన వెస్టిండీస్ బౌలర్లను హెల్మెట్ కూడా లేకుండా ఎదుర్కొన్న సునీల్ గావస్కర్ రిటైరవుతుండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరా? అని ఆందోళన రేగింది. కానీ, 16 ఏళ్లకే అరంగేట్రం చేసి దాదాపు పాతికేళ్లు బ్యాట్ తో పరుగుల ప్రవాహం రేపాడు సచిన్ టెండూల్కర్.. అతడూ రిటైరవుతున్న క్రమంలో వచ్చాడు విరాట్ కోహ్లి. తన ముందరి దిగ్గజాలను మరిపిస్తూ టి20ల్లోనూ మెరుపులు మెరిపించాడు.
ఆ ఫిట్ నెస్ అందరికీ సాధ్యమా?
2008లో జాతీయ జట్టులోకి వచ్చిన సమయంలోని కోహ్లికి.. 2014 నాటి కోహ్లికి.. ఆ తర్వాతి కోహ్లికి అసలు సంబంధమే లేదంటే నమ్ముతారా? ఫిట్ నెస్ కోసం అంతలా తనను తాను మార్చుకున్నాడు విరాట్. సగటు క్రికెటర్ ఫిట్ నెస్ తో ఉంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేనని, ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ గా ఎదగలేనని భావించిన కోహ్లి తన శరీరాన్ని మొత్తం తదనుగుణంగా మార్చుకున్నాడు. అందుకే ఏడెనిమిదేళ్ల పాటు అతడి బ్యాట్ నుంచి పరుగులు ప్రవాహంలా వచ్చాయి.
జన్మదినాన జయహో..
కోహ్లీ ఆదివారంతో 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 1988 నవంబరు 5న పుట్టిన అతడు 2008 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ లో కి వచ్చాడు. అంతకుముందు మార్చిలో దేశానికి అండర్ 19 ప్రపంచ కప్ ను అందించాడు. కాగా, ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతున్న కోల్ కతా మైదానంలో ఆడే మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అన్ని ఫార్మాట్లలో 78 సెంచరీలు కొట్టాడు. ప్రస్తుత ఆటగాళ్లలో ఈ రికార్డుకు దగ్గరగా ఎవరూ లేరు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (100) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (71) మూడో స్థానంలో ఉన్నాడు.
సెంచరీల హాఫ్ సెంచరీ చేస్తాడా?
వన్డేల్లో కోహ్లీ సెంచరీల అర్థ సెంచరీకి రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ (49)ను సమం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. వాస్తవానికి ఈ కప్ లో రెండుసార్లు కోహ్లి 80ల్లో ఔటయ్యాడు. వీటిలో ఏ ఒక్కదానిని సెంచరీగా మలిచినా సచిన్ రికార్డును సమం చేసేవాడు. కాగా, ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో 514 మ్యాచ్‌ల్లో 26,209 పరుగులు చేశాడు. ఈ లిస్ట్‌లో 34,357 పరుగులు చేసిన సచిన్ టాప్ లో నిలిచాడు. లంక వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, కోహ్లి అంతర్జాతీయ మ్యాచ్‌లలో 136 అర్ధ సెంచరీలు సాధించాడు.