Begin typing your search above and press return to search.

అనంతపురంలో విరాట్ కోహ్లి.. దులీప్ ట్రోఫీ కోసం రావడం ఖాయమే?

ఈ ప్రకారం సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ కూడా బరిలో దిగుతారని తెలుస్తోంది. సెప్టెంబరు 5 నుంచి జోన్ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో వీరిని మైదానంలో చూసే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 10:35 AM GMT
అనంతపురంలో విరాట్ కోహ్లి.. దులీప్ ట్రోఫీ కోసం రావడం ఖాయమే?
X

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో మూడు ఫార్మాట్లు ఆడిన గొప్ప బ్యాట్స్ మన్ గా అతడు చరిత్రలో నిలిచిపోతాడు. అయితే, భారత జట్టుకు ఎంపికయ్యాక తీరిక లేని క్రికెట్ కారణంగానో, దేశవాళీ క్రికెట్ పట్ల నిర్లక్ష్యమో గానీ చాలామంది క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోరు. అయితే, కోహ్లి ఈ తరహా కాదు. కాకపోతే ఐపీఎల్ తో సమానంగా 2008లో విరాట్ అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా రంజీట్రోఫీలు ఆడడం కష్టమైపోతోంది. ఇప్పుడు మాత్రం దేశవాళీ బరిలో దిగే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

హెడ్ కోచ్‌ గా గంభీర్‌ వచ్చాక ఆటగాళ్లంతా దేశవాళీలు ఆడాలనే నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలి శ్రీలంక పర్యటన నుంచి వచ్చిన టీమ్ ఇండియా సభ్యులకు 40 రోజుల వరకు ఎలాంటి సిరీస్‌ లూ లేవు. మరోవైపు బంగ్లాదేశ్‌ తో వచ్చే నెల 19 నుంచి టెస్టు సిరీస్‌ జరగనుంది. ఆపై అత్యంత ఆసక్తికర, తీవ్ర పోటీ ఉండే ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. అందుకని దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రకారం సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ కూడా బరిలో దిగుతారని తెలుస్తోంది. సెప్టెంబరు 5 నుంచి జోన్ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో వీరిని మైదానంలో చూసే అవకాశం ఉంది.

దులీప్ ట్రోఫీ అంటే..

సౌత్, నార్త్, ఈస్ట్.. ఇలా జోన్ ల వారీగా నిర్వహించేది దులీప్ ట్రోఫీ. రంజీ ట్రోఫీ తర్వాత ఇదే ముఖ్యమైన టోర్నీ. దీంట్లో కోహ్లి, రోహిత్ పాల్గొనడం అంటే యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమే. టోర్నీ ప్రారంభ మ్యాచ్ సెప్టెంబరు 5న గ్రూప్ –గ్రూప్ బి జట్ల మధ్యన ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి తూర్పు జోన్ తరఫున బరిలో దిగే చాన్సుంది. ఎందుకంటే అతడి సొంత రాష్ట్రం ఢిల్లీ ఈస్ట్ జోన్ కిందకు వస్తుంది. కాగా, కోహ్లి అనంతపురంలో ఆడే అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీనే. ఎందుకంటే..

విమాన కనెక్టివిటీ లేకపోవడంతో..

కోహ్లి వంటి సూపర్ స్టార్ అనంతపురం వస్తున్నాడంటే సందడి మామూలుగా ఉండదు. అయితే, అనంతపురానికి ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద దెబ్బ కానుంది. కోహ్లి బెంగళూరుకు వచ్చి అక్కడినుంచి అనంతపురం చేరాల్సి ఉంటుంది. లేదా పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ కోహ్లి కచ్చితంగా ఆడే నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అనంతపురం నుంచి మ్యాచ్ ను వేరేచోటకు తరలించే అవకాశం ఉంటుంది. కాగా,

సిరీస్‌ ల మధ్య ఎక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఫిట్‌ నెస్, ఫామ్‌ కాపాడుకునేందుకు క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. పనిభారం రీత్యా కొందరు స్టార్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈసారి జడేజా, గిల్, రాహుల్, శాంసన్ పలువురు క్రికెటర్లు దేశవాళీలో ఆడనున్నారు. స్టార్‌ పేసర్ బుమ్రాను మాత్రం మినహాయించారు. పని ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు నుంచి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉన్నందున బుమ్రాను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని బీసీసీఐ భావిస్తోంది. పేసర్ షమీ దేశవాళీలో ఆడనున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ కు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ తీరు మార్చుకుని దేశవాళీకి సిద్ధం అయ్యాడు.