Begin typing your search above and press return to search.

సుందర్.. అనూహ్యంగా వచ్చాడు.. ఏడు వికెట్లు పడగొట్టాడు

న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్.. టీమ్ ఇండియా 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరే లేదు.. ఎక్కడో ఢిల్లీలో తమిళనాడు తరఫున రంజీ మ్యాచ్ ఆడుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   24 Oct 2024 11:14 AM GMT
సుందర్.. అనూహ్యంగా వచ్చాడు.. ఏడు వికెట్లు పడగొట్టాడు
X

న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్.. టీమ్ ఇండియా 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరే లేదు.. ఎక్కడో ఢిల్లీలో తమిళనాడు తరఫున రంజీ మ్యాచ్ ఆడుకుంటున్నాడు. అయితే, బెంగళూరులో తొలి టెస్టు ముగిసింది.. టీమ్ ఇండియా పరాజయం పాలైంది. అంతే.. 16వ సభ్యుడిగా అతడికి పిలుపొచ్చింది. ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి టీమ్ ఇండియాతో కలిశాడు. తీరా చూస్తే.. గురువారం మొదలైన రెండో టెస్టులో అతడు అద్భుతం చేశాడు.

రావయ్యా సుందర్..

తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ ను మొన్నటివరకు రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. కానీ, అతడిని బీసీసీఐ అనూహ్యంగా టీమ్ ఇండియాతో చేర్చింది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో సుందర్ మూడేళ్ల కిందట చివరిగా టెస్టు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ సంప్రదాయ ఫార్మాట్ బరిలో దిగలేదు. కానీ, బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ తో ఓటమి అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌.. హఠాత్తుగా సుందర్ కావాలంటూ కబురు పంపాడు. సీనియర్లు జడేజా, అశ్విన్ లతో పాటు సుందర్ ను ఆడించాడు. కుల్దీప్ యాదవ్ ను పక్కనపెట్టాడు. సుందర్ ఆఫ్ స్పిన్నర్, ఎడమ చేతి వాటం బ్యాటర్. ఢిల్లీతో రంజీ మ్యాచ్ లో వన్ డౌన్ లో దిగి భారీ సెంచరీ (150) చేశాడు. ఫింగర్ స్పిన్నర్ అయిన సుందర్ మూడేళ్ల కిందట 2021లో ఆస్ట్రేలియాలోని పేస్ అనుకూలించే గబ్బాలో తొలి టెస్టు ఆడాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆరేడేళ్ల నుంచి టీమ్ ఇండియాలోకి వస్తూ పోతున్న అతడు నాలుగు టెస్టుల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.

వచ్చాడు.. ప్రత్యర్థిని ‘ఏడు’పించేశాడు..

మూడేళ్ల తర్వాత అనుహ్యంగా భారత జట్టుకి ఎంపికైన, పుణె టెస్టులో తుది జట్టులోనూ చోటు దక్కించుకున్న సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్డాడు. 59 పరుగులిచ్చిన సుందర్.. ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో అతడు ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో మిగిలిన మూడు వికెట్లు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/59)కు దక్కాయి. కాగా, సుందర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కు డేంజర్ బెల్ మోగిస్తున్నాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం, అశ్విన్ కంటే మెరుగ్గా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలగడం సుందర్ ప్రత్యేకత. దీంతో 38 ఏళ్ల అశ్విన్ కు 24 ఏళ్ల సుందర్ ను జట్టు మేనేజ్ మెంట్ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.