ఐపీఎల్ మ్యాచ్ కు శుద్ధి చేసిన వేస్ట్ వాటర్.. 75 వేల లీటర్లు
ఉద్యాన నగరి.. హైటెక్ నగరి.. టెక్ రాజధాని.. కానీ, ఇప్పడు నీటి కటకటకు రాజధానిగా మారింది.
By: Tupaki Desk | 21 March 2024 11:30 AM GMTఉద్యాన నగరి.. హైటెక్ నగరి.. టెక్ రాజధాని.. కానీ, ఇప్పడు నీటి కటకటకు రాజధానిగా మారింది. తాగడానికి నీళ్లు లేవు నాయనా అంటుంటే.. ఐపీఎల్ మ్యాచ్ కు వేల లీటర్లు అవసరం అవుతున్నాయి. అసలే 16 ఏళ్లుగా కప్ కొట్టని తమ ఫ్రాంచైజీ ఈసారైనా కల నెరవేరుస్తారని అభిమానులు ఆశిస్తుంటే వారి అశలపై నీళ్లుజల్లుతోంది వాతావరణం.
మ్యాచ్ లు ఉన్నట్టా? లేనట్టా?
కర్ణాటక రాజధాని, టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సొంత గడ్డ బెంగళూరులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లు ఉంటాయా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. వర్షాభావం కారణంగా బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ లకూ కష్టాలు తప్పేలా లేదు. ఐపీఎల్ మ్యాచ్ ఒక్కోదానికి 75 వేల లీటర్ల నీరు అవసరం అవుతుందని అంచనా.
శుద్ధి చేసిన వేస్ట్ వాటర్ వినియోగం
ఐపీఎల్ కోసం చిన్నస్వామి స్టేడియంలో నీటి వసతి కల్పించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డ్ కోరింది. దీంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనుంది. వీటిని ప్రఖ్యాత కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనుండడం గమనార్హం కావేరీ నది, భూగర్భ జలాలను వాడకుండా ఇలా ప్రత్యామ్నాయం చూశారన్నమాట.
వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, భారీగా నిర్మాణాలు పెరగడంతో బెంగళూరులో నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోయాయి. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభం నెలకొంది. వైట్ ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఆర్‌ఆర్ నగర్, కేంగేరీ, సీవీ రామన్ తదితర ప్రముఖ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బెంగళూరురోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోందని స్వయంగా సీఎం సిద్ధరామయ్యే చెప్పారు. నగరానికి 260 కోట్ల లీటర్ల నీటి వాడకం పట్టే బెంగళూరులో.. 14 వేల బోర్లకు గాను 6,900 ఎండిపోయాయి. దీంతో కార్ వాషింగ్, గార్డెన్లు, నిర్మాణాలకు తాగు నీటిని వాడటంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.